పంట మార్పిడి,
నానో యూరియాపై ప్రత్యేక దృష్టి
ఎల్‌నినో కంటింజెన్సీ ప్లాన్ బుక్‌లెట్ ఆవిష్కరణ
హన్మకొండ అర్బన్ : ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, వివిధ శాఖల సంసిద్ధత, కాంటింజెన్సీ ప్రణాళికలపై మంగళవారం హనుమకొండ ఐడీఓసీ కలెక్టరేట్‌లో ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌లు, ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు తీసుకుంటున్న చర్యలను సమావేశంలో వివరించారు. వర్షాభావ పరిస్థితులకు తగినట్లు ప్రత్యామ్నాయ పంటలపై గ్రామస్థాయిలో ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..
జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయిలో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ, పంచాయతీరాజ్, ఉద్యాన, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌తో అనుసంధానించి 2,400 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగుకు లక్ష్యాలు నిర్దేశించామని చెప్పారు.
ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం..
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ ఎల్‌నినో దృష్ట్యా మండల, గ్రామ స్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. పప్పుధాన్యాలు, కూరగాయల సాగుతో పాటు ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. తాగునీటి సమస్య తలెత్తకుండా రిజర్వాయర్ల నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, పైపులైన్ లీకేజీల మరమ్మతులు చేపడుతున్నామని చెప్పారు.
సాగుపై రైతులకు మార్గనిర్దేశం..
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా పంట మార్పిడి విధానం, ఆరుతడి పంటల సాగుపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో రైతులకు వాతావరణానుకూల సాగు విధానాలపై సూచనలు అందిస్తున్నారని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు.
దేవాదులపై సమగ్ర కార్యాచరణ..
ములుగు కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ దేవాదుల ఎత్తిపోతల పథకంపై జిల్లా స్థాయిలో సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర మాన్యువల్ రూపొందిస్తున్నామని, ప్రస్తుతం పనిచేస్తున్న పంపులతోపాటు మిగతా పంపుల మరమ్మతులు, విడిభాగాల లభ్యత వంటి వివరాలను అందులో పొందుపరుస్తామని చెప్పారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి భూసేకరణతోపాటు ఇతర జిల్లాల సూచనల ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభల ద్వారా రైతులకు పంట మార్పిడి విధానంపై అవగాహన కల్పించామన్నారు. మహిళా సంఘాల ద్వారా కూరగాయలు, లెమన్ గ్రాస్ వంటి వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తున్నామన్నారు. నానో యూరియా వినియోగం, డ్రోన్ ఆధారిత వ్యవసాయ సేవలపై కార్యాచరణ రూపొందించామని, రైతులకు ఎరువుల సరఫరా సులభతరం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు.
యూరియా కొరత లేదు..
జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేద ని, డీఏపీ ఎరువుల సరఫరా మార్క్‌ఫెడ్ ద్వారా కొనసాగుతోందన్నారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న దుకాణాలపై చర్యలు తీసుకు ని సీజ్ చేశామని చెప్పారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ, మున్సిపల్ స్థాయిలో పంట మార్పిడిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి వరి నాట్లు గణనీయంగా తగ్గాయని, జిల్లాలోని ఎక్కువ చెరువుల్లో నీటిమట్టా లు తగ్గిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలసాగుపై దృష్టి సారిస్తున్నామని వివరించారు.
2026 వానాకాల పంట సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ రూపొందించిన ‘ఎల్‌నినో కంటింజెన్సీ ప్లాన్–2026’ బుక్‌లెట్‌తో పాటు పంటల క్యాలెండర్లను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించే క్రమంలో హనుమకొండ జిల్లా హసన్‌పర్తి, ఎల్క తుర్తి, దామెర, భీమదేవరపల్లి మండలాలకు చెందిన రైతులకు సబ్సిడీపై కంది, పెసర విత్తనాల ప్యాకెట్లను మంత్రుల చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ప్రత్యామ్నాయ పంటలపై ప్రత్యేక చర్యలు
ఉమ్మడి జిల్లా సమీక్షలో కలెక్టర్లు


