రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో వరుసగా చోటు చేసుకుంటున్న చైన్‌స్నాచింగ్ ఘటనలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. సోమవారం పడమటిగూడెంలో నిద్రిస్తున్న వృద్ధురాలి మెడలోని మూడు తులాల బంగారు గొలుసును అపహరించిన ఘటన మరువక ముందే మంగళవారం మండలంలోని ఫతేషాపూర్‌లో మరో వృద్ధరాలిని లక్ష్యంగా చేసుకుని దుండగులు బంగారు గొట్టాలను అపహరించారు. గ్రామానికి చెందిన శివరాత్రి మల్లమ్మ మంగళవారం మధ్యాహ్నం ఇంటి ఎదుట కూర్చొని ఉండగా ఇద్దరు దుండగులు బైక్‌పై గ్రామంలో తిరుగుతూ గ్రామం చివరన ఉన్న ఆమె వద్దకు వచ్చారు. ఒకరు బైక్‌పైనే ఉండగా, మరొకరు సెల్ ఫోన్‌తో అమ్మా..మా చుట్టాల వారి ఇల్లు దొరకడం లేదు.. ఫొటో చూసి ఇల్లు చూపిస్తావా అంటూ మాటల్లో పెట్టాడు. వృద్ధురాలు సెల్ ఫోన్‌లోని ఫొటోలను వంగి చూస్తుండగా అదే అదునుగా భావించి ఆమె మెడలో ఉన్న తులంన్నర బంగారు గుండ్ల తాడును లాక్కొని రామచంద్రగూడెం వైపునకు పరారయ్యారు. వృద్ధురాలు లబోదిబోమంటూ అరవడంతో సమీపంలో ఉన్న యువకులు పరిగెత్తుకొని వచ్చినా అప్పటికే దుండగులు తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై నరేశ్ ఘటనా స్థలికి చేరుకొని వృద్ధురాలి నుంచి వివరాలు సేకరించారు.
● వృద్ధురాలిని మాటల్లో దింపి
చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన దుండగులు


