వీరన్న సన్నిధిలో కలెక్టర్‌ దంపతుల పూజలు | - | Sakshi
Sakshi News home page

వీరన్న సన్నిధిలో కలెక్టర్‌ దంపతుల పూజలు

Jul 23 2026 1:18 AM | Updated on Jul 23 2026 1:18 AM

కురవి: మండలకేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో బుధవారం కలెక్టర్‌, ఎస్పీ స్నేహశబరీష్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్‌ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వారిపేరుతోపాటు కుటుంబసభ్యుల పేర్లపై గోత్రనామర్చనలు చేశారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ముఖమండపంలో కలెక్టర్‌ దంపతులు, కుటుంబ సభ్యులకు తీర్థ ప్రసాదాలను అందించి వేదాశీర్వచనాలు అందజేశారు. ఆలయ చైర్మన్‌ కొర్ను రవీందర్‌రెడ్డి వారిని సత్కరించారు.

రన్నింగ్‌ స్టాఫ్‌ సమస్యలు పరిష్కరించాలి

డోర్నకల్‌: రైల్వే రన్నింగ్‌ స్టాఫ్‌ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం డోర్నకల్‌ రైల్వే స్టేషన్‌లో మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రన్నింగ్‌ స్టాఫ్‌ విధుల్లో చేరినప్పటి నుంచి విధులు ముగిసే వరకు కనీసం 120 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో మజ్దూర్‌ యూనియర్‌ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్‌లోని లోకో లాబీ ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రన్నింగ్‌ స్టాఫ్‌కు 120 కిలోమీటర్ల మైలేజీకి పైగా దూరం వెళ్లేలా విధులు కేటాయించాలని ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్‌ యూనియర్‌ డోర్నకల్‌ బ్రాంచ్‌ చైర్మన్‌ చరణ్‌నాయక్‌, బ్రాంచ్‌ సెక్రటరీ అంజయ్య, వైస్‌ చైర్మన్‌లు సుందరయ్య, వీరన్న, నాగశేషు, అసిస్టెంట్‌ సెక్రటరీలు కరణ్‌సింగ్‌, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలోని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో పురుగుల అన్నం ఇరుకు గదులు అనే శీర్షికన బుధవారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనికి స్పందించి ఎమ్మెల్యే డాక్టర్‌ భూక్య మురళీనాయక్‌ బుధవారం కళాశాలలోని వంట గదులను, విద్యార్థుల ఇరుకు గదులు, కళాశాల ప్రాంగణం, తరగతుల గదులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు. ఒకే గదిలో 50 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి అవసరమైతే ప్రైవేట్‌ బిల్డింగ్‌లోకి వసతులు కల్పించాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 90 ఎకరాల భూమిలో నూతన భవన నిర్మాణం చేస్తామని, విద్యార్థి సంఘాలతో కలిసి ధర్నాలో పాల్గొనవద్దన్నారు. సమస్యలు ఉంటే ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ బలారాంనాయక్‌, కౌన్సిలర్‌ సల్వాదీ దిలీప్‌, నాయకులు ఎడ్ల రమేష్‌, రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్య

అందించాలి

గార్ల: విధుల్లో సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా ట్రైబల్‌ వెల్ఫేర్‌ డీడీ దేశీరాంనాయక్‌ ఉపాధ్యాయులను ఆదేశించారు. బుధవారం గార్లలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలలో కొనసాగుతున్న ఇంగ్లిష్‌ భాషా ఇంప్రూమెంట్‌ ప్రోగ్రాం, డిజిటల్‌ క్లాస్‌లను పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల ప్రభలే అవకాశం ఉన్నందున పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.డీడీ వెంట హెచ్‌ఎం సీహెచ్‌ జోగయ్య, వార్డెన్‌ రూపాదేవి, పీడీ పద్మ, బుచ్చానాయక్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement