● క్వింటాకు రెండు కిలోలు తక్కువ
● ఆవేదన వ్యక్తం చేస్తున్న రేషన్ డీలర్లు
● ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
మహబూబాబాద్: తూకం వేయకుండా రేషన్ బియ్యం సరఫరా చేయడంతో క్వింటాకు సుమారు రెండు కేజీలు తక్కువగా వస్తుందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తూకం వేసి రేషన్ షాపులకు సరఫరా చేయాలని ఆదేశాలు ఉన్నా.. గోదాం ఇన్‌చార్జ్‌లు ఆదేశాలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సంబంధిత అధికారుల వద్ద మొర పెట్టుకున్నా స్పందించక పోవడంతో అడిషనల్ కలెక్టర్ వద్ద విన్నవించారు. గోదాంలో ఉన్న ప్రభుత్వం అందించిన 50 క్వింటాళ్లను తూకం వేసే కాంటాను వినియోగించుకోవాలని ఉన్నా.. గోదాం ఇన్‌చార్జ్‌లు ఉపయోగించడం లేదని, ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 558 రేషన్ షాపులు
జిల్లాలో 18 మండలాలకు గాను 558 రేషన్‌షాపులు ఉన్నాయి. 2,78,712 రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతీ నెల 1 నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. బయో మెట్రిక్, ఐరీష్, ఓటీపీ విధానాలతో పంపిణీ జరుగుతోంది. ప్రతీ నెల గోదాంల నుంచి 25 వ తేదీ నుంచి 30వ తేదీ వరకు షాపులకు కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు.
ఆరు ఎంఎల్‌ఎస్ పాయింట్లు
జిల్లాలో ఆరు ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి బియ్యం ఆయా మండలాలకు లారీల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇందులో మానుకోట, కేసముద్రం, మరిపెడ, తొర్రూర్, కొత్తగూడ, గార్లలో ఎంఎల్‌ఎస్ పాయింట్లు ఉన్నాయి.
దిగుమతి భారంగా
ట్రాక్టర్‌ల నుంచి షాపులకు దిగుమతి చేయడానికి హమాలీలు క్వింటాకు రూ.10, డ్రైవర్ ఇతర ఖర్చులు కలిసి 50 క్వింటాళ్లకు రూ.1,000, వంద క్వింటాళ్లు అయితే రూ.2,000 ఖర్చు అవుతుందని డీలర్లు అంటున్నారు. క్వింటాకు రూ.1.40 పైసలు మాత్రమే కమిషన్ ఇస్తున్నారని, 100 క్వింటాకు రూ.14,000 కమీషన్‌గా వస్తుందన్నారు. అదనంగా కిరాయి, కరెంట్ బిల్లులు పోను రూ 5,000 కూడా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తూకం విషయంలో వినతులు
తూకం వేసి బియ్యం సరఫరా చేయాలని డీలర్లు వారం రోజులుగా డీసీఎస్‌ఓ కార్యాలయం, సివిల్ సప్లయీస్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈనెల 20న సివిల్ సప్లయీస్ డీఎం నర్సింహరావు, డీసీఎస్‌ఓ రమేశ్‌కు వినతులు ఇచ్చారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ కె.అనిల్‌కుమార్‌ను కలిశారు. అడిషనల్ కలెక్టర్ సమక్షంలోనే తూకం విషయంలో చర్చలు జరుగగా ఎట్టకేలకు వేబ్రిడ్జి తూకంతో సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన్నట్లు డీలర్లు తెలిపారు. అయితే వేబ్రిడ్జి తూకంతో న్యాయం జరగది, గోదాంలో ఉండే 50 క్వింటాళ్లు వేసే కాంటా ద్వారా ఇవ్వాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు.
‘వేబ్రిడ్జి’తోనే సరఫరా..
ఆగస్టు మాసంలో మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. తూకం విషయంలో డీలర్లు వినతులు ఇవ్వగా మూడు నెలలు కావడంతో ఆలస్యమవుతుందని వేబ్రిడ్జి ద్వారా ఇస్తామని హామీ ఇచ్చాం. గోదాంలో యాబై క్వింటాళ్ల తూకం వేసే కాంటాలు ఉన్నా.. మూడు నెలల కోటాతో ఆలస్యమవుతుంది. ఈ ఒక్కసారి వేబ్రిడ్జి ద్వారా ఇచ్చి తర్వాత కాంటా ద్వారా పంపిణీ చేస్తాం.
– జాటోత్ రమేశ్, డీసీఎస్‌ఓ


