● డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ
● మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన
మహబూబాబాద్ రూరల్: నీట్ వైఫల్యానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు భూక్య ఉమ డిమాండ్ చేశారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బుధవారం కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఉమ మాట్లాడుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఇరవై రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులు, యువకులపై లాఠీఛార్జ్ చేసి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నీట్ విద్యార్థులకు సంఘీభావంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అమానుషంగా దాడి చేయటం ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గుచేటన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుగులోత్ జ్యోతిరమేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, డైరెక్టర్ దేశెట్టి మల్లయ్య, సర్పంచులు కొత్త హేమంత్, గుండెల రేణుక, కౌన్సిలర్లు సలువాది దిలీప్, బొల్లు రాజు, అంబాల శివకుమార్, గాడిపల్లి నాగేశ్వర్ రావు, పుచ్చకాయల సరిత, నాయకులు ఎండీ హారుణ్, ఘనపురపు అంజయ్య, విజయలక్ష్మి పాల్గొన్నారు.


