ఎందుకీ నగదు కొరత?
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రస్తుత కాలంలో డిజిటల్ చెల్లింపులు పెరిగినా, నగదు అవసరం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నగదు కొరత రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. బ్యాంకుల్లో రూ.50 వేల నగదు తీసుకోవాలన్నా రెండు, మూడు రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏటీఎంలలో ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిస్తుండడంతో ప్రజలు ఒక ఏటీఎం నుంచి మరో ఏటీఎంకు తిరుగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని ఖాతాదారులు చెబుతున్నారు. వ్యవసాయ పనులు, ఆస్పత్రి ఖర్చులు, కూలీల చెల్లింపులు, పెన్షన్ల కోసం నగదు అవసరమైన సమయంలో బ్యాంకులు పరిమిత మొత్తాలే చెల్లిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
‘క్యాష్ లేదు.. రేపు రండి’
ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఎస్‌ఎల్‌బీసీ రిపోర్టు ప్రకారం అన్ని బ్యాంకులు కలిపి సుమారు 1,285 వరకు ఏటీఎంలు ఉన్నాయి. ఇందులో 350కి పైగా అసలే పని చేయడం లేదు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఏటీఎంలలో నగదు కొరత కనిపిస్తోందని ఏటీఎంల ఆపరేటర్లే చెబుతున్నారు. నగదు సమకూర్చడంలో ఇబ్బందులు, క్యాష్ లాజిస్టిక్స్ సమస్యల వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపి ఎక్కువగా మూతబడ్డాయి. కాగా, అనేక బ్యాంకు శాఖల్లోనూ మధ్యాహ్ననికే నగదు నిల్వలు అయిపోతున్నాయి. దీంతో ‘ఈరోజు క్యాష్ అయిపోయింది... రేపు రండి’, ‘ఒక్కొక్కరికి పరి మితంగా మాత్రమే ఇస్తాం’ అంటూ చాలాచోట్ల ఖా తాదారులను వెనక్కి పంపుతున్నట్లు సమాచారం.
వృద్ధులు, రైతులపై తీవ్ర ప్రభావం..
నగదు కోసం ప్రజలు వరుసగా మూడు, నాలుగు ఏటీఎంలు తిరిగినా ఖాళీ చేతులతోనే వెనుదిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు ఉపయోగించలేని వృద్ధులు, గ్రామీణ మహిళలు, చిన్న రైతులు పూర్తిగా నగదుపైనే ఆధారపడుతున్నారు. ఖాతాల్లో డబ్బు ఉన్నా నగదు అందక వైద్య ఖర్చులు, ఎరువులు, విత్తనాల కొనుగోలు, కూలీల చెల్లింపుల్లో ఇబ్బందులు పడుతున్నారు. కాగా, నగదు లేక ప్రజలు రావడం తగ్గడంతో కొన్ని గ్రామాల్లో ఏటీఎం కేంద్రాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఖాళీగా ఉండే ఏటీఎంలలో పశువులు తలదాచుకోవడం, మరికొన్ని చెత్తతో పేరుకుపోయి ఉంటున్నాయి.
విత్‌డ్రాకు నగదు కరువు..
బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు
రూ.50 వేల నగదు తీసుకోవాలన్నా రోజుల నిరీక్షణ
‘నో క్యాష్’ బోర్డులతో
వెలవెలబోతున్న ఏటీఎంలు
వృద్ధులు, రైతులు, గ్రామీణులకు
తీవ్ర ఇబ్బందులు
కుక్కలు, పశువులకు ఆశ్రయంగా
ఏటీఎంలు
బ్యాంకింగ్ వర్గాల సమాచారం ప్రకారం ఆన్‌లైన్, యూపీఐ లావాదేవీలు పెరగడంతో నగదు పంపిణీ విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కరెన్సీ చెస్ట్‌ల నుంచి నగదు సరఫరా పరిమితంగా రావడం లేదు. నగదు రవాణా, భద్రత ఖర్చులను తగ్గించే చర్యలు, ఏటీఎంలలో నగదు నింపే సంస్థల పరిమిత షెడ్యూళ్లు, కొన్ని శాఖల్లో నగదు అవసరాన్ని సరిగా అంచనా వేయకపోవడం వంటి కారణాలు నగదు కొరతకు దారితీస్తున్నాయని కొందరు బ్యాంకు అధికారులే చెబుతున్నారు.


