వరంగల్ చౌరస్తా : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కౌలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు విస్సా కిరణ్ కుమార్, బి. కొండల్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. మంగళవారం వరంగల్ అబ్బనికుంటలోని రైతు భవన్‌లో సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమడి శ్రీనివాస్ అధ్యక్షతన ఉమ్మడి జిల్లా కౌలు రైతుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా వారు మాట్లాడుతూ 2011 చట్టం ప్రకారం కౌలు రైతులకు వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేసి, ప్రభుత్వ పథకాలు అందించాలన్నారు. తెలంగాణలో 36 శాతం పైగా ఉన్న కౌలు రైతులు పంట ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నా వారికి ప్రభుత్వ సౌకర్యాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ’ అనేక ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమం కొనసాగిస్తున్నదని తెలిపారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్, నాయకులు రాజయ్య, మొగిలి, బాలరాజు, నాగేశ్, సంపూర్ణ, సురేశ్, ప్రసాద్, హంసాల్ రెడ్డి, రవీందర్, విజయ్, సుదర్శన్, సాంబయ్య, అనిత, రవీందర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


