హెల్మెట్ ధరిస్తే అభినందన
మహబూబాబాద్ రూరల్ : హెల్మెట్ ధరించిన వారికి చాక్లెట్ ఇచ్చి అభినందించారు.. ధరించని వారికి పువ్వు ఇచ్చి పెట్టుకోవాల్సిందిగా అభ్యర్థించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని నెహ్రూసెంటర్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జి శాలిని షాకెల్లి ప్రత్యేక శిబిరం నిర్వహించి వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె హెల్మెట్ ధరించిన వారికి చాక్లెట్ ఇచ్చి అభినందనలు తెలిపారు. అలాగే హెల్మెట్ ధరించని వారికి పారా లీగల్ వలంటీర్ల ద్వారా పువ్వు ఇప్పిస్తూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందిగా అభ్యర్థించారు. అనంతరం మార్కెట్ సెంటర్‌లో వాహనదారులకు రోడ్డు నియమాలపై అవగాహన కల్పించి మాట్లాడారు. దూర ప్రాంతాలైతేనే హెల్మెట్ ధరిస్తామని, దగ్గర ప్రాంతాలకు అవసరం లేదనే భ్రమను వాహనదారులు తొలగించుకోవాలన్నారు. వాహనం నడుపుతున్న అన్నివేళల్లో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు సాయిచరణ్, వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఎస్సై అరుణ్ కుమార్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కృష్ణ, పారా లీగల్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
పెట్టుకోకుంటే అభ్యర్థన
వినూత్న కార్యక్రమం చేపట్టిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ


