వరిలో వెదజల్లే పద్ధతి ప్రయోజనకరం
● డీఏఓ సరిత
గూడూరు: వెదజల్లే పద్ధతితో వరి సాగు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి సరిత అన్నారు. మండలంలోని బొద్దుగొండ గ్రామంలో శనివారం మండల వ్యవసాయ అధికారి అబ్దుల్‌మాలిక్, విస్తరణాధికారి మనోజ్‌తో కలిసి వరి సాగు క్షేత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో సాగవుతున్న వరి పంటపై తెల్సుకొని, ఓ రైతు సాగు చేస్తున్న వెదజల్లే పద్ధతిలో మెలకువలపై పలు సూచనలు చేశారు. అనంతరం పలువురు రైతులకు వెదజల్లే పద్ధతిపై వివరించారు. ఈ విధానంతో కూలీల ఖర్చు, పెట్టుబడి ఆదా, విత్తన మోతాదు తగ్గుతుందని తెలిపారు. అదే విధంగా ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాల లబ్ధి సులభంగా పొందవచ్చని తెలిపారు. యాసంగి పంట సాగు చేసే రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడొద్దని, అవసరమైన నిల్వలు ఉన్నాయని తెలిపారు.
ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి
మహబూబాబాద్ రూరల్ : పట్టా కలిగిఉన్న ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని డీఏఓ సరిత సూచించారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో ఫార్మర్ రిజిస్ట్రీపై శనివారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ రైతులు నేరుగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవచ్చని తెలిపారు. అలా వీలుకాని రైతులు వ్యవసాయ విస్తరణ అధికారుల వద్దకు వస్తే ఈ పక్రియను పూర్తి చేస్తారన్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులు కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాల లబ్ధి సులభంగా పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాధికారి తిరుపతిరెడ్డి, క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి పూజిత పాల్గొన్నారు.
రైతులు ఆందోళన చెందవద్దు
కేసముద్రం: యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భూక్య సరిత అన్నారు. మున్సిపాలిటీ పరిధి దన్నసరిలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన యూరియా పంపిణీ విధానాన్ని ఆమె పరిశీలించి మాట్లాడారు. కేసముద్రం మండలంలో రెండు పీఏసీఎస్‌లు, ఆగ్రో రైతు సేవా కేంద్రం ప్రైవేట్ డీలర్ల ద్వారా 1,886 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు తెలిపారు. కేంధ్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు విశిష్ట గుర్తింపు ఐడీ కోసం సమీపంలోని మీసేవా సెంటర్లు, ఏఈఓలను సంప్రదించి ఫార్మర్ రిజస్ట్రేషన్ చేయించుకుని ఐడీ పొందాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ వెంకన్న, సీఈఓ మల్లారెడ్డి, ఏఈఓలు రాజేందర్, సాయిచరణ్, శ్రీనివాస్, రవివర్మ, లావణ్య పాల్గొన్నారు.


