కార్మికుల భద్రతపై పట్టింపేది..?
బయ్యారం: పొట్టకూటి కోసం పిల్లాపాపలతో పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు ఇటుకబట్టీల్లో మగ్గుతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి బతుకీడుస్తున్నారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన యాజమాన్యాలు తాత్కాలిక షెడ్లు వేసి తమ పనులు పూర్తి చేసుకుంటున్నారు. వసతిపై దృష్టి సారించాల్సిన కార్మికశాఖాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రతీ ఏడా ది వలస కార్మికులు దుర్భర జీవితం గడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేస్తున్న అధికారులు, యజమానులు ఆ తర్వాత కార్మికులను వదిలేస్తున్నారు.
ఇటుకబట్టీల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ కార్మికులు..
ఇటుకబట్టీల్లో పనిచేసేందుకు స్థానికంగా కార్మికుల కొరతతో యజమానులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొస్తుంటారు. గంధంపల్లి, కొత్తపేట, నామాలపాడు గ్రామాల పరిధిలో సుమారు 50 ఇటుకబట్టీలు కొనసాగుతుండగా వీటిలో దాదాపు 2 వేల మంది కార్మికులు పనులు చేస్తున్నారు. వీరందరూ తాము పనిచేసే బట్టీల వద్ద యజమానులు ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసాల వద్దే కుటుంబాలతో జీవిస్తూ పనుల్లో నిమగ్నమవుతారు.
అన్నీ ఆరుబయటనే..
ఇటుకబట్టీల వద్ద కార్మికులు, వారి పిల్లలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉండవు. వీటితో పాటు మహిళా కార్మికులు స్నానాలు చేసేందుకు సైతం గదులు ఏర్పాటు చేయకపోవడంతో వారు బట్టీల సమీపంలో ఉన్న బోర్లు, ఏటి ప్రాంతంలో ఆరుబయటనే స్నానాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.
ప్రాణాలు పోతున్నా..
ఇటుకబట్టీల వద్ద ఏర్పాటు చేసిన నివాసాలు విషపురుగులకు నిలయంగా మారాయి. వీటితో పాటు అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్‌తీగలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మూడేళ్ల క్రితం ఒక బట్టీ వద్ద రాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో కార్మికుడి కుమార్తెకు విషపురుగు కుట్టడంతో మరణించింది. రెండు సంవత్సరాల క్రితం ఒక బట్టీలో విద్యుత్ కనెక్షన్లు సరిగా లేక ఒక కార్మికుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇలా వెలుగులోకి రాకుండా మరణించిన కార్మికుల మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా వారి స్వస్థలాలకు పంపించిన ఘటనలు గతంలో ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.
మామూలుగానే వదిలేస్తున్న అధికారులు..
కార్మికులకు యజమానులు కనీస వసతులు కల్పించడంతో పాటు వారికి చట్టపరమైన వేతనాలు, సెలవులు తదితర సౌకర్యాలను కల్పించేవిధంగా కార్మికశాఖాధికారులు కృషి చేయాల్సి ఉంటుంది. అయితే ఆ శాఖాధికారులు కేవలం యజమానులతో సమావేశాలు పెట్టి చేతులు దుపులుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు కార్మికులకు కనీస వసతులను కల్పించేలా కృషి చేయాల్సిన అవసరం ఉంది.
ఇరుకుగదుల్లో విషపురుగుల నడుమ నివాసం
ఆరుబయటనే కాలకృత్యాలు
దుర్భర జీవనం గడుపుతున్న ఇటుకబట్టీ కార్మికులు


