లబ్ధిదారులను ఇబ్బందిపెడితే చర్యలు
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
మహబూబాబాద్ రూరల్ : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదా రులను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ హెచ్చరించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఎంపీడీఓలతో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదోడి చిరకాల కోరిక సొంతింటి కల అని, రేవంత్ రెడ్డి సర్కారు అర్హులకు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తోందన్నారు. లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం వెనువెంటనే బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ లబ్ధిదారుడికి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు న్యాయం జరగాలని, ఫైళ్లను పెండింగ్‌లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా పర్యవేక్షణ పెంచాలని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు పూర్తిస్థాయిలో చేరాలంటే అధికారులు బాధ్యతతో పనిచేయాలని పేర్కొన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ, డీఈ, ఏఈలు, నియోజకవర్గ పరిధిలోని ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.


