అనుబంధ రంగాలపై దృష్టి సారించాలి
మహబూబాబాద్ రూరల్ : రైతులు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించి ఆర్థికంగా బలోపేతం కావాలని వరంగల్ ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి సూచించారు. శుక్రవారం మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రంలో సాంకేతిక సలహా సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఉమారెడ్డి హాజరై మాట్లాడారు. వానాకాలం వరి సాగు అనంతరం రెండో పంటగా పెసర, మినుము, బొబ్బెర, జనుమును సాగుచేసుకోవాలని సూచించారు. మల్యాల కేవీకే సమన్వయకర్త డాక్టర్ దిలీప్ కుమార్ కేవీకేలో జరుగుతున్న విస్తరణ, శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, విత్తనోత్పత్తి, నిర్వహించిన వివిధ కార్యక్రమాలపై సమావేశంలో తెలియజేశారు. జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి మరియన్న, జిల్లా వ్యవసాయ అధికారి సరిత మాట్లాడుతూ.. యూరియాను మోతాదుకు మించకుండా వాడాలని పేర్కొన్నారు. ఆయిల్ పామ్, కూరగాయల సాగుతో రైతులు లాభం పొందాలని సూచించారు. కేవీకే శాస్త్రవేత్త క్రాంతికుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వరి తర్వాత పొద్దుతిరుగుడు, పెసర, మినుము, జనుము సాగు చేయాలని వివరించారు. మరో శాస్త్రవేత్త సుహాసిని మాట్లాడుతూ.. ఉద్యాన పంటల సాగులో భాగంగా బంతిపూలు, కూరగాయల పంటల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేసవి తీగజాతి కూరగాయల సాగును తెలియజేశారు. ఈ సమావేశంలో డీఈ నాముని, శివకృష్ణ, అభ్యుదయ రైతులు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
వరంగల్ ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్
డాక్టర్ ఉమారెడ్డి


