నాణ్యమైన భోజనం అందించండి..
కేయూ క్యాంపస్: తమకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీలోని మహిళా హాస్టల్ మెస్ విద్యార్థినులు గురువారం ఆందోళనకు దిగారు. పరిపాలనాభవనాన్ని ముట్టడించారు. అన్నంలో పురుగులు, మేకులు, సీస పెంకులు కూడా వస్తున్నాయని, భోజనం నాణ్యతగా ఉండటంలేదని, అన్నం కూడా సరిపడా పెట్టడంలేదని ఆరోపించారు. మెస్‌లోనికి కుక్కలు కూడా వస్తున్నాయని తెలిపారు. తమకు పెట్టాల్సిన భోజనం వేరే మెస్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య రాజేందర్, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ విభాగం ప్రొఫెసర్ ఆచార్యులు మామిడాల ఇస్తారి తదితరులు తమకు సమస్యలు వివరించాలని కోరగా.. తమ సమస్యల పరిష్కారానికి వీసీ వచ్చి హామీఇవ్వాలని నిరసన కొనసాగించారు. అనంతరం పరిపాలనాభవనంలోనికి చొచ్చుకొని వెళ్లి వీసీ చాంబర్‌లో నిరసన తెలిపారు. స్పందించిన వీసీ.. హాస్టళ్ల డైరెక్టర్ రాజ్‌కుమార్, జాయింట్ డైరెక్టర్లు, కేర్‌టేకర్లను పిలిపించి అకాడమిక్ కమిటీహాల్‌లో సమావేశం ఏర్పాటుచేసి విద్యార్థినులతో మాట్లాడించారు. అనంతరం విద్యార్థులు.. పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వీసీకి అందజేశారు. ఏబీవీపీ కేయూ అధ్యక్షుడు హరికృష్ణ, బాధ్యులు మాధవరెడ్డి, మెరుగు సాయికుమార్, విజయ్, క్రాంతి, రాజు తదితరులు పాల్గొన్నారు.
కేయూ మహిళా హాస్టల్ విద్యార్థినుల ఆందోళన
పరిపాలనాభవనం ముట్టడి


