అప్రమత్తంగా వ్యవహరించాలి
● జిల్లా జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా పోలీసు, రెవెన్యూ, సంక్షేమశాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ పిలుపునిచ్చారు. ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా పోలీసు, రెవెన్యూ అధికారులతో జిల్లా కోర్టులో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు నిఘా విభాగానికి అన్ని రకాల సమాచారాలు వస్తుంటాయని, బాల్యవివాహాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. బాల్య వివాహాల గురించి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. వివాహం జరిగిన తర్వాత సమాచారం వస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. బాల్యవివాహాలు లేదా పోక్సో చట్టానికి సంబంధించి బాధిత బాలికలు పాఠశాలల్లో వివక్షకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. గుర్తుతెలియని వాహనాల వల్ల జరిగే ప్రమాదాల్లో బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా పోలీసు అధికారులు న్యాయ సేవా సంస్థ సహాయం తీసుకోవాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని మాట్లాడుతూ.. నామాలపాడు, కొత్తగూడ ప్రాంతాల్లోని ఇటుక బట్టీల్లో తల్లిదండ్రులతో నివసిస్తున్న పిల్లల చదువులు, పౌష్టికాహారం విషయంలో శ్రద్ధ తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిని కోరారు. న్యాయమూర్తులు స్వాతి మురారి, కృష్ణతేజ్, ఎం.ధీరజ్ కుమార్, అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కిరణ్, డీఈఓ రాజేశ్వర్ రావు, జిల్లాలోని పోలీసు స్టేషన్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్లు పాల్గొన్నారు.


