సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
● డీఎస్పీ కృష్ణ కిశోర్
పెద్దవంగర: విద్యార్థులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిశోర్ అన్నారు. సైబర్ జాగృతి దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మండలంలోని చిన్నవంగర కస్తూర్బాగాంధీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ కృష్ణ కిశోర్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న సైబర్ మోసాలతో పాటు డిజిటల్ అరెస్టు వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయడం ముఖ్యమని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 వినియోగంపై వివరించారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టపరమైన రక్షణ అంశాల గురించి చెప్పారు. అనంతరం రోడ్డు భద్రతలో భాగంగా మండల కేంద్రంలోని ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్ హెల్మెట్ ప్రాముఖ్యతపై వాహనదారులకు అవగాహన కల్పించారు. పోలీస్ సిబ్బంది సుధాకర్, హరీశ్, విద్యార్థులు పాల్గొన్నారు.


