కవి.. కష్టజీవి పక్షానే ఉండాలి
విద్యారణ్యపురి: కవి ఎప్పుడూ కష్టజీవి పక్షానే ఉండాలని, ప్రజలను చైతన్యవంతం చేసేలా రచనలు ఉండాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు. బుధవారం రాత్రి అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం (అరసం )90వ ఆవిర్భావ దినోత్సవం హనుమకొండలోని ఆదర్శ ‘లా’ కాలేజీలో నిర్వహించారు. ఈ సభకు అరసం రాష్ట్ర అధ్యక్షుడు పల్లేరు వీరస్వామి అధ్యక్షత వహించారు. అంపశయ్య నవీన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో బ్రిటిష్ వలసవాదం, దోపిడీ, అణిచివేతలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు లక్నోలో 1936 ఏప్రిల్ 9,10తేదీల్లో అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటు అయిందన్నారు. అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ మాట్లాడుతూ దేశంలో నాడు ఏ పరిస్థితులున్నాయో ఇప్పటికీ అవే పరిస్థితులు ఉన్నాయన్నారు. అణిచివేత కొనసాగుతోందన్నారు. అనంతరం పల్లేరు వీరస్వామి రచించిన ‘వీక్షణాలు’, కేవీఎల్ రచించిన ‘లింగమ్మ’ పుస్తకాన్ని అంపశయ్యనవీన్ , ప్రముఖ కవి బన్న అయిలయ్య ఆవిష్కరించారు. అరసం ఉపాధ్యక్షురాలు చందనాలసుమిత్ర పుస్తక సమీక్ష చేశారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అనిశెట్టి రజిత, బాధ్యులు మార్కశంకర్‌నారాయణ, నిధి, బూర భిక్షపతి, బూర విద్యాసాగర్, పాంచల్‌రాయ్ మాట్లాడారు. న్యాయవాది ఏరుకొండ జయశంకర్, హనుమకొండ భారత్‌బచావో చైర్మన్‌రామబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ
అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్


