కర్నూలు(హాస్పిటల్): ఫైనాన్స్ వారి వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతకు ముందు ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. బాధితుని కథనం మేరకు.. దేవనకొండ మండలం ఈదుల దేవరబండ గ్రామానికి చెందిన సుంకన్న కుమారుడు బి.బ్రహ్మయ్య(32) ఊళ్లో తండ్రికి చెందిన ఐదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో కోడుమూరులో ఓ చిన్న హోటల్ నిర్వహిస్తున్నాడు. ఆయన మూడున్నర ఏళ్ల క్రితం ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో రూ.10 లక్షల రుణం తీసుకున్నాడు. ప్రతి నెలా రూ.18వేలు కంతు చెల్లిస్తూ వచ్చాడు. అయితే మూడు నెలలుగా అతను కంతులు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులపై బ్రహ్మయ్య కోర్టును ఆశ్రయించారు. డిసెంబర్‌లోగా బకాయిలు చెల్లించాలని కోర్టులు ఉత్తర్వులు ఇచ్చింది. అయినా సరే ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు కొందరు నెలరోజులుగా బ్రహ్మయ్య వద్దకు వచ్చి బకాయిలు తీర్చాలని, లేకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తూ వచ్చారు. రెండు రోజుల క్రితం ఈ బెదిరింపులు మరీ ఎక్కువ కావడంతో బాధపడుతూ బ్రహ్మయ్య బుధవారం రాత్రి కోడుమూరులోని తన హోటల్ ఎదుట క్రిమిసంహారక మందు తాగాడు. చికిత్స నిమిత్తం వెంటనే అతన్ని కుటుంబసభ్యులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్: కడప రైల్వేస్టేషన్‌లో గురువారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో గుండప్ప అనే వ్యక్తిని రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. మృతుడు కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పీఆర్ పల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.


