కర్నూలు(అగ్రికల్చర్): రానున్న ఐదు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గుంటూరులోని గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవా కేంద్రం ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు వ్యవసాయ వాతావరణ బులెటిన్ విడుదల చేసింది. ఐదు రోజుల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉష్ణోగ్రతలు 37 నుంచి 38 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జూన్, జూలై, ఆగస్టు నెలల్లో అతి తక్కువ లోటు వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 116.2 మి.మీ ఉంది. ఈ నెలలో 11 రోజులు గడచిపోగా.. కేవలం 4.7 మి.మీ వర్షం కురిసింది. ఈ నెలకు సంబంధించి 96 శాతం లోటు వర్షపాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో 3.65 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. విత్తనం వేసినప్పటి నుంచి వర్షాలే లేకపోవడంతో దాదాపు 50వేల హెక్టార్లలో పంటలను పూర్తిగా దున్నేశారు. మరో లక్ష హెక్టార్లలో పంటలు పూర్తిగా ఎండిపోయాయి. మిగిలిన పంటలు కూడ ఎండలకు మాడిపోతున్నాయి. ఏ పంటలో కూడా దిగుబడులు 10 శాతం కూడా వచ్చే అవకాశం లేదని వ్యవసాయ అధికారులే పేర్కొంటున్నారు.
దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు చర్యలు
కర్నూలు కల్చరల్: దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.రామాంజనేయులు ఆదేశించారు. శుక్రవారం కర్నూలు డీసీ కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల అసిస్టెంట్ కమిషనర్‌లు, ఇన్‌స్పెనక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్యాక్రాంతమైన వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కోర్టుల్లోని కేసుల పరిష్కారానికి తగిన సాక్ష్యాధారాలు సమర్పించాలన్నారు. సీజీఎఫ్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించి పెండింగ్‌లోని ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. సమావేశంలో కర్నూలు అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి, నంద్యాల డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ పాండురంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
● 19న పోలింగ్ కేంద్రాల తుది జాబితా
కర్నూలు(అర్బన్): జెడ్పీటీసీ, ఎంపీటీసీ 2వ సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జెడ్పీటీసీ ఓటర్ల జాబి తాలను శుక్రవారం జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో ప్రచురించినట్లు జిల్లా పరిషత్ సీఈఓ ఆర్.సుధాకర్‌రెడ్డి తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన 53 జెడ్పీటీసీ స్థానాలకు చెందిన ఓటర్ల జాబితాలను సిద్ధంగా ఉంచామన్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని ఎంపీటీసీ ఓటర్ల జాబితాలను కూడా ఆయా మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో ప్రచురించారని పేర్కొన్నారు. ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ఈ నెల 19న ప్రచురించేందుకు చర్యలు చేపట్టినట్లు సీఈఓ వెల్లడించారు. ఈ నెల 14న పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ ప్రిపరేషన్, 15న ముసాయిదా జాబితాలను ప్రకటించామన్నారు. అలాగే 15, 16వ తేదిల్లో అభ్యంతరాలను స్వీకరించి పరిశీలిస్తారన్నారు. 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు గుర్తించిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారన్నారు. 18వ తేదిన జిల్లా కలెక్టర్ అనుమతితో 19వ తేదిన పోలింగ్ కేంద్రాల తుది జాబితాలను ప్రచురించడం జరుగుతుందన్నారు.
ఎస్సార్బీసీ ఈఈ బాధ్యతల స్వీకరణ
కొలిమిగుండ్ల(అవుకు): అవుకు ఎస్సార్బీసీ ఈఈగా భవాని ప్రసాద్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గోరుకల్లు ఈఈగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ఉన్నతాధికారులు అవుకు ఎస్సార్బీసీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. విధుల్లో చేరగానే డీఈలు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవుకు రిజర్వాయర్, ఇతర స్లూయిస్‌ల మరమ్మతులకు కృషి చేస్తామన్నారు.


