కర్నూలు(అగ్రికల్చర్): ఎన్నికలు వస్తున్నాయంటే హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకపోవడం టీడీపీ అధినేత చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అని ప్రజలందరికీ తెలిసిన విషయమే. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్త పింఛన్లు ఇవ్వడానికి దరఖాస్తులను ఆహ్వానించడం తాజా ఉదాహరణగా నిలిచింది. రెండున్నర ఏళ్లుగా కొత్త పింఛన్ల కోసం అవ్వాతాతలు, వితంతు మహిళలు, దివ్యాంగులు, ఇతర వర్గాల వారు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నెల 7వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాలలో పింఛన్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. ఈనెల 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయకచవితి సెలవులు ఉన్నాయి. దరఖాస్తులు అప్‌లోడ్ చేసుకోవడానికి కేవలం 15న మంగళవారం, 16న బుధవారం రెండు రోజులే గడువు ఉంది. కర్నూలు జిల్లాలో 672, నంద్యాల జిల్లాలో 516 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అప్‌లోడ్ అయిన దరఖాస్తులను పరిశీలిస్తే తక్కువేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. శుక్రవారం నాటికి కర్నూలు జిల్లాలో 32,186, నంద్యాల జిల్లాలో 28,462 దరఖాస్తులు అప్‌లోడ్ అయ్యాయి.
అస్తవ్యస్తం.. గందరగోళం
కోసిగి: కొత్త పింఛన్ దరఖాస్తు ప్రక్రియ గందరగోళంగా మారింది. అన్ని సర్టిఫికెట్లు తీసుకుని గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్తే మరొకటి కావాలని వెనక్కి పంపుతున్నారు. కుల, ఆదాయ సర్టిఫికెట్ల కోసం వీఆర్వో, ఆర్‌ఐ, తహసీల్దార్ల చుట్టూ ప్రజలు తిరగాల్సి వస్తోంది. కోసిగి మండలంలో 19 సచివాలయాలు ఉండగా ఆరుగురు మాత్రమే డిజిటల్ అసిస్టెంట్స్ ఉన్నారు. సిబ్బంది కొరత ఉండగా సర్వర్ సమస్య వేధిస్తుండటంతో వృద్ధులు అవస్థలు పడుతున్నారు.
కరెంట్ కోతలు.. సర్వర్ సమస్యలు!
కోడుమూరు రూరల్: కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుని గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లిన వారికి కరెంట్ కోతలు ఎదురవుతున్నాయి. ప్రతి రోజూ ఒక్కో సచివాలయంలో 30 నుంచి 50 వరకు దరఖాస్తులు వస్తున్నాయి. కోడుమూరులో ఐదు వార్డు సచివాలయాలు ఉండగా శుక్రవారం కరెంట్ కోతతో దరఖాస్తులు అప్‌లోడ్ చేయడంలో సమస్యలు వచ్చాయి. సర్వర్ వేధిస్తుండటంతో దరఖాస్తు చేసుకుంటున్న వారికి రెండుసార్లు ఓటీపీ ఆలస్యంగా వస్తోంది. దీంతో గంటల తరబడి కార్యాలయాల్లో నిరీక్షించాల్సి పరిస్థితి నెలకొంది. కరెంట్ కేవలం ఒక గంట ఉండి.. రెండు గంటల పాటు పోతుంది.. మళ్లీ అదే పరిస్థితి తలెత్తుతోంది. పింఛన్ల దరఖాస్తుకు ఈనెల 16వతేదీ వరకే సమయాన్ని ఇవ్వడంతో వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సాధారణంగా వృద్ధాప్య పింఛన్లకు ఆధార్, రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది.
ప్రస్తుతం కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడుగుతున్నారు.
ఆధార్ చరిత్ర, ఓటరు ఐడీ/ బ్యాంకు పాస్ బుక్/ పాస్‌పోర్టు/పాన్‌కార్డుల్లో ఏదో ఒకటి, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి కరెంటు బిల్లు అవసరమని పేర్కొంటున్నారు.
వితంతువు పింఛన్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలంటే 8 రకాల ధ్రువపత్రాలు అవసరమంటూ మహిళలకు చుక్కలు చూపిస్తున్నారు.
సాధారణంగా వితంతు పింఛన్లకు 18 ఏళ్లు నిండిన మహిళలు అర్హులై. భర్త మరణించిట్లు ధ్రువపత్రం, ఆధార్, రేషన్ కార్డు సరిపోతుంది.
ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ చరిత్ర, భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఓటరు ఐడీ/ బ్యాంకు పాస్ బుక్/ పాస్‌పోర్టు/పాన్‌కార్డుల్లో ఏదో ఒకటి, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి కరెంటు బిల్లు అవసమని చెబుతున్నారు.
ఆధార్ లేక ముందు(2010కి ముందు) భర్త మరణించిన మహిళలకు ఇప్పటి వరకు పింఛన్లు లేవు. అటువంటి వారిని భర్త ఆధార్ అడుగుతుండటం తీవ్ర అందోళన కలిగించే విషయం.


