కర్నూలు(అగ్రికల్చర్): బ్యాంకింగ్‌లో ఐదు రోజుల పని దినాలను వెంటనే అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. యుఎఫ్‌బీయూ పిలుపు మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో చేపట్టిన బ్యాంకుల సమ్మె విజయవంతమైంది. సమ్మెలో భాగంగా కార్పొరేట్ బ్యాంకులు మినహా పబ్లిక్, ప్రైవేటు సెక్టారు బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు మూతపడ్డాయి. బ్యాంకుల సమ్మెకు ఏఐటీయూసీ, సీఐటీయూ మద్దతు ప్రకటించాయి. బ్యాంకుల మూతతో లావాదేవీలు స్తంభించిపోయాయి. యుఎఫ్‌బీయూ జిల్లా కన్వీనర్ ఇ.నాగరాజు నాయకత్వంలో బ్యాంకు ఉద్యోగులు జిల్లా పరిషత్ నుంచి రాజ్‌విహార్ మీదుగా ఐదు రోడ్ల కూడలి, రాజ్ థియేటర్ మీదుగా కేఇ ప్లాజా వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా యూనియన్ ముఖ్య నేతలు మాట్లాడుతూ గత వేతన ఒప్పందంలో బ్యాంకుల యాజమాన్య సంస్థ ఐబీఏ ఐదు రోజుల బ్యాంకింగ్‌కు అంగీకరించి ఇప్పటికి రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయకపోవడం దారుణమన్నారు. బ్యాంకు లాభాల్లో ప్రతి ఉద్యోగి పాత్రను గుర్తించి అందరికీ ఆమోదయోగ్యమైన పీఎల్‌ఐ విధానం తీసుకురావాలని కోరారు. ఇప్పటికై నా స్పందించకపోతే ఈ నెల 28, 29, 30 తేదీల్లో సమ్మె నిర్వహిస్తామని, అప్పటికీ స్పందించకపోతే అక్టోబరు 26 నుంచి నిరవధిక సమ్మె చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐబీఈఏ నాయకులు శివకృష్ణ, అనిల్ రెడ్డి, ఏఐబీవోసీ నాయకులు రాజు, పుష్పక్‌కుమార్, ఎన్‌సీబీఈ నాయకులు విద్యాసాగర్, శ్రీకాంత్, ఏపీజీబీ నాయకులు హనుమంతు, ఐబో నాయకులు మంజునాథ్, విజయ్, హనుమంతురెడ్డి, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.


