● నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్
ఏడీఆర్ జయలక్ష్మి
కర్నూలు(అగ్రికల్చర్): ‘ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో వివిధ హోదాల్లో 28 ఏళ్లుగా పనిచేస్తున్నా. ఎప్పుడూ ఇంతటి తీవ్రమైన కరువును చూడలేదు. ఎల్‌నినో ప్రభావంతో 60 రోజులకుపైగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. వర్షాధారం కింద సాగు చేసిన పత్తిలో 15 కిలోల నుంచి క్వింటాళు కూడా దిగుబడి వచ్చే అవకాశం లేదు. మేం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేశాం.. అన్ని చోట్ల పంటలు దెబ్బతిని ఉన్నాయి’ అని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్(ఏడీఆర్) జయలక్ష్మి తెలిపారు. కర్నూలు జిల్లాలో 80 వేల హెక్టార్లకు పైగా పంటలు వర్షాభావం వల్ల పూర్తిగా పాడైపోయాయని, నంద్యాల జిల్లాలో 30 వేల హెక్టార్లలో పంటలు దున్నేశారని ఏడీఆర్ తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరువు తీవ్రతపై ‘సాక్షి’ తో నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ వి.జయలక్ష్మి మాట్లాడారు.
ప్రశ్న: పంటల పరిస్థితి ఎలా ఉంది?
జవాబు: కర్నూలు జిల్లాలో పత్తి, ఆముదం, కంది పంటల పరిస్థితి దయనీయంగా ఉంది. నంద్యాల జిల్లాలో మొక్కజొన్న, మినుము వంటి పంటలను దున్నేశారు. మేం వెళ్లిన ప్రతి చోట పంటల పరిస్థితి అధ్వానంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడ కూడా పంటల పరిస్థితి సంతృప్తికరంగా లేదు.
ప్రశ్న: దిగుబడులు వచ్చే అవకాశం ఉందా?
జవాబు: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు రెండు నెలలుగా లేవు. కర్నూలు జిల్లాలో ప్రత్తి ప్రధాన పంట. వర్షాధారం కింద సాగు చేసిన పత్తిలో 15 కిలోల నుంచి క్వింటా వరకు కూడా దిగుబడి రావడం కష్టమే. పెట్టుబడి ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంది. అక్కడక్కడ పత్తి పంటకు ఒకటి, రెండు నీటి తడులు ఇచ్చుకున్నారు. అటువంటి వాటిల్లో 2–3 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మామూలుగా అయితే ఒకటి, రెండు నీటి తడులు ఇచ్చిన పత్తిలో 12 క్వింటాళ్ల వరకు వస్తుంది. నంద్యాల జిల్లాలో మొక్కజొన్నలో దిగుబడులు జీరో ఉండే అవకాశం ఉంది. మహా అయితే క్వింటా నుంచి రెండు క్వింటాళ్ల వరకు రావచ్చు. మినుములో అక్కడక్కడ క్వింటా వరకు దిగుబడులు వచ్చే అవకాశం ఉంది.
ప్రశ్న: వర్షాల పరిస్థితి ఎలా ఉంది?
జవాబు: వరుసగా రెండు నెలల పాటు వర్షాలు లేకపోవడం ఇదే మొదటిసారి. నంద్యాల జిల్లాలో 30 మండలాలు ఉన్నాయి. అన్ని మండలాల్లో లోటు వర్షపాతమే ఉంది. ఇటువంటి పరిస్థితి గతంలో ఎపుడూ లేదు. కర్నూలు జిల్లాలో 5 మండలాల్లో సాధారణ వర్షపాతం ఉండగా.. మిగిలిన మండలాల్లో వర్షపాతం లోటు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రశ్న: వరి పంట పరిస్థితి ఎలా ఉంది?
జవాబు: నంద్యాల జిల్లాల్లో బోర్లు, ఇతర నీటి వసతి కింద 15 వేల నుంచి 20 వేల హెక్టార్లలో వరి వంగడాలను నేరుగా విత్తుకున్నారు. కాల్వలకు నీళ్లు రాకపోవడం, బోర్లలో నీళ్లు లేకపోవడంతో వరి పంట పంట పూర్తిగా దెబ్బతినింది. నంద్యాల జిల్లాలో మొదటిసారిగా వరి పంట దెబ్బతినడంతో రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారు.
ప్రశ్న: గతంలో ఇలాంటి కరువును చూశారా?
జవాబు: దాదాపు మూడు దశాబ్దాల కాలంలో ఎప్పు డూ ఇలాంటి తీవ్రమైన కరువును చూడలేదు. మొదటి సారిగా తీవ్రమైన కరువు పరిస్థితులను చూస్తున్నాం.
ప్రశ్న: ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలకు
అవకాశం ఉందా?
జవాబు: కర్నూలు జిల్లాలో నల్లరేగడి నేలల్లో వేసిన పత్తి దెబ్బతిని ఉంటే తీసేసి సెప్టెంబరు 15 నుంచి జొన్న, శనగ వంటి పంటలు సాగు చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ పంటలు కూడా 100 మీ.మీ. వర్షపాతం నమోదు అయినప్పుడే వేసుకోవాలి. తెల్ల జొన్నలో ఎన్‌జీజే5(కిలో ధర రూ.96), ఎన్ 15 రకాలు(కిలో ధర రూ.108) ప్రత్యామ్నాయ పంటలుగా వేసుకోవచ్చు. శనగలో దేశివాళీ రకాలు నంద్యాల గ్రామ్ 452, 857, 776, 1267, కాబూలి రరాలు నంద్యాల గ్రామ్ 49, 810 రకాలు వేసుకోవచ్చు. ఈ రకాలన్నీ నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌లో రైతులకు అందుబాటు ఉన్నాయి. సబ్సిడీ ఉండదు. శనగలో దేశీవాళీ రకాలు కిలో ధర రూ.115, కాబూలీ రకాల కిలో ధర రూ.150 ప్రకారం రైతులకు ఇస్తాం.


