కౌతాళం: విద్యుత్ సరఫరాను సక్రమంగా అందించాలని కోరుతూ హాల్వి సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన ఘటన బుధవారం రాత్రి 11గంటలకు చోటు చేసుకుంది. హాల్వి, గొతులదొడ్డి, వల్లూరు గ్రామస్తులు వందలాదిగా తరలివచ్చి హాల్వి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. విద్యుత్ కోతలు సాయంత్రం 5 నుంచి రాత్రి 11గంటల వరకు విధించడం పట్ల ఆయా గ్రామస్తులు సిబ్బందితో వాగ్వాదానికి దిగి సబ్‌స్టేషన్‌కు తాళం వేశారు. రాత్రిళ్లు విద్యుత్ సరఫరా నిలిపేస్తే ఎలా బతికేదని వాపోయారు. ఏఈ, డీఈని పిలిపించండని రెండు గంటల పాటు సిబ్బందిని లోపలికి పోకుండా అడ్డుకున్నారు. రాత్రి 11గంటల తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో శాంతించారు. పరిస్థితిలో మార్పు రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.


