ఆదోని: మండలంలోని గణేకల్లు సబ్‌స్టేషన్ ముందు ప్రధాన రహదారిపై సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు వీరారెడ్డి, డి.రామాంజనేయులు ఆధ్వర్యంలో గురువారం రాత్రి స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఎలాంటి సమాచారం లేకుండా విద్యుత్ కోత విధించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం విషయం తెలుసుకుందామంటే అధికారుల ఫోన్లు కూడా పనిచేయడం లేదన్నారు. అప్రకటిత విద్యుత్ కోతలను ఎత్తివేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
రెండు రోజులుగా కోతలు
కోవెలకుంట్ల: బనగానపల్లె నియోజకవర్గంలోని పలు మండలాల్లో లోడ్ రిలీఫ్(ఎల్‌ఆర్) పేరిట రెండు రోజులుగా రాత్రి వేళల్లో విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బుధవారం రాత్రి 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విద్యుత్ కోత విధించగా.. గురువారం సాయంత్రం 6.45 గంటల నుంచి రాత్రి 8.20 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేశారు. రెండు రోజుల నుంచి ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు గంటల తరబడి చీకట్లో మగ్గుతున్నారు. ఉక్కపోతతో పాటు దోమల మోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.


