● ఆధ్య అగ్రిక్రాప్ సైన్స్ కంపెనీలో
అధికారుల తనిఖీలు
● లోపాలను గుర్తించి హెచ్చరించిన వైనం
జూపాడుబంగ్లా: తంగడంచ రెవెన్యూ పరిధిలోని ఆధ్య అగ్రిక్రాప్‌సైన్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో నిర్వహణ లోపాలు అధికారుల తనిఖీలో వెలుగు చూశాయి. గురువారం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గంగాధర్‌రావు, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు టెక్నికల్ ఏఓ ఆయూబ్‌బాషా, ఏడీఏ గిరీష్, ఏఓ కృష్ణారెడ్డి కంపెనీని తనిఖీ చేశారు. తనిఖీ నిమిత్తం అధికారులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న కంపెనీ నిర్వాహకులు ఉత్పత్తి నిలిపేసి లేబర్‌ను బయటకు పంపించేశారు. కంపెనీలో నిల్వ చేసిన డబ్బాలు, ప్రొడక్ట్ కవరింగ్ లేబుల్స్, ల్యాబ్‌లను అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం తయారు చేస్తున్న 24 రసాయనిక మందులకు సంబంధించి యాంటీ డోస్ ఇంజెక్షన్లు కంపెనీలో అందుబాటులో లేకపోవటంతో నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 80 మంది లేబర్ పనిచేస్తుండగా ప్రమాదకరమైన కెమికల్స్ వల్ల ప్రాణాపాయం సంభవిస్తే యాంటీడోస్ లేకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రథమ చికిత్స గది, చికిత్స నిర్వహించేందుకు డాక్టర్‌ను నియమించకపోవటంతో నిర్వాహకులపై మండిపడ్డారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడుతూ ఆధ్య కంపెనీలో 124 రకాల ప్రొడెక్టుల తయారీకి అనుమతి ఉన్నప్పటికీ ప్రస్తుతం 24 రకాల మందులు తయారుచేస్తున్నట్లు తెలిపారు. కంపెనీ నిర్వహణలో లోపాలను గుర్తించి సరి చేసుకోవాలని కంపెనీ యాజమాన్యానికి సూచించామన్నారు. తనిఖీ నివేదికను తయారు చేసి జిల్లా కలెక్టర్‌తో పాటు కమిషనర్‌కు అందజేస్తామన్నారు.


