కర్నూలు(సెంట్రల్): తక్షణమే ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేసింది. బుధవారం ఆయా సంఘాల ఆధ్వర్యంలో గాయత్రీ ఎస్టేట్ నుంచి బిర్లాగేటు వరకు నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా, రంగప్ప మాట్లాడుతూ పోలీసు పోస్టుల సంఖ్యను పెంచాలని కాకినాడలో నిరుద్యోగులు శాంతియుతంగా చేపట్టిన ఆందోళనపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం అన్యాయమన్నారు. నిరుద్యోగులపై అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తునట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే ధ్యేయమని చెప్పిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తోందని విమర్శించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తమ ప్రభుత్వం వస్తే ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఉంటుందని పదేపదే చెప్పారని.. మరి ఇప్పుడు అహంకారం పెరిగిందా అని ప్రశ్నించారు. ఇప్పటికై నా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఎస్‌ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ 11,639 పోస్టులతో ఇవ్వాలని డిమాండ్ చేశారు.


