కర్నూలు: స్కూటీ నంబరు ప్లేట్ ఆధారంగా ఇంటికి కన్నం వేసిన దొంగలను పోలీసులు వలపన్ని పట్టుకొని కటకటాల్లోకి పంపారు. 4వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని ఉల్చాల రోడ్డులోని ఆదిత్యనగర్‌లో జయంతి మహేశ్వరరెడ్డి నివాసం ఉంటున్నారు. జూలై 6వ తేదీ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యలతో ఊరికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగుల గొట్టి లోనికి ప్రవేశించారు. పడకగదిలో ఉన్న బీరువాను బద్దలు కొట్టి 25 గ్రాములు బంగారు నగలు, 320 గ్రాముల వెండి ఆభరణాలు మూట గట్టుకొని ఉడాయించారు. బాధితుడు జయంతి మహేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని.. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. చోరీ జరిగిన రోజు అనుమానాస్పదంగా ఆ ప్రాంతంలో తిరిగిన స్కూటీని గుర్తించి నంబరు ప్లేట్ ఆధారంగా నిందితులపై ఆరా తీశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన ఎరుకలి శివప్రసాద్, ప్రస్తుతం గుత్తిలో ఉంటున్న పామిడికి చెందిన ఎరుకలి రామాంజనేయులు, కర్నూలు ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన కామ్లే కార్తీక్ ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. సీఐ విక్రమసింహ, ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి క్రైమ్ పార్టీ పోలీసులు సుబ్బరాయుడు, మురళీ, జీనత్, ఈశ్వర్, గోవిందు తదితరులు బృందాలుగా ఏర్పడి దొంగల కదలికలపై నిఘా ఉంచారు. కర్నూలు శివారులోని సమ్మర్ స్టోరేజీ పక్కన పొలాల్లో దొంగలు దాక్కొన్ని ఉన్నట్లు సమాచారం అందడంతో ఆదివారం వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. వారి వద్ద నుంచి 2 బంగారు చైన్‌లు, చిన్న పిల్లల ఉంగారాలు కలిపి 25 గ్రాముల బంగారం, 32 తులాల వెండి, దొంగతనానికి వినియోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయమూర్తి ఎదట హాజరు పరుచగా రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు.
సీసీటీవీ ఫుటేజీ ద్వారా
కేసు ఛేదించిన పోలీసులు
కటకటాల్లోకి ఇంటి దొంగలు
25 గ్రాముల బంగారం,
320 గ్రాముల వెండి రికవరీ


