హొళగుంద: ఎల్లార్తిలో షేక్షావలి, షాషావలి తాతల ఉరుసు గురువారం జియారత్ కార్యక్రమంతో ప్రశాంతంగా ముగిసింది. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళునాడు నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దర్గాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవంలో భాగంగా 8న గంధం, 9న ఉరుసు, 10న జియారత్ కార్యక్రమాలు జరిగాయి. దర్గాల సయాద్ నసీన్ ముతవలి, పీఠాధిపతి నూర్‌బాబా ఖాద్రి భక్తులకు ధర్మసందేశాన్ని ఇచ్చి ఆశీర్వదించారు. ఏపీ వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో ఈఓ ఇమ్రాన్, ఇన్‌స్పెక్టర్ సోహెల్ పర్యవేక్షణలో జరిగిన ఉరుసులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హొళగుంద ఎస్‌ఐ దిలీప్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
విద్యుత్ ప్రమాదాలను నివారిద్దాం
● ఎస్‌ఈ ప్రదీప్ కుమార్
కర్నూలు (అగ్రికల్చర్): వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ ప్రదీప్ కుమార్ తెలిపారు. ఏమాత్రం అలసత్వం వహించినా తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదముందని హెచ్చరించారు. గురువారం వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న కమిటీల ప్రతినిధులకు ఆయన పలు సూచనలు చేశారు. వినాయక మండపాలకు తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ల కోసం ముందస్తుగా విద్యుత్ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుని రశీదు పొందాలని తెలిపారు. అక్రమంగా విద్యుత్ వాడకం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. మండపాలలో తక్కువ నాణ్యత కలిగిన వైర్లు వాడకూడదని, వైర్లకు జాయింట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విగ్రహాల ఊరేగింపులో ఉపయోగించే వాహనాలు, డీజేలు, మైక్ సెట్‌ల ఎత్తును గమనించాలని సూచించారు. విద్యుత్ అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే 1912, 9440813332, 9491067203, 9440813334 నంబర్లకు కాల్ చేయడంతో పాటు సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారమివ్వాలని సూచించారు.


