● విద్యాశాఖ జేడీ మువ్వా రామలింగం
మంత్రాలయం రూరల్: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఏపీ రాష్ట్రవిద్యాశాఖ జేడీ మువ్వా రామలింగం అన్నారు. మాధవరం, విద్యానగర్‌లోని ఎస్‌ఎంకెవీ జిల్లా ఉన్నత పాఠశాలలను గురువారం ఆయన తనిఖీ చేశారు. మాధవరం జిల్లా ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆదేశించారు. విద్యానగర్‌లోని ఎస్‌కేవీ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడు, సిబ్బందితో మట్లాడుతూ.. 750 పైగా ఉన్న విద్యార్థులు ఉన్న హైస్కూల్ ప్రహారిగోడ లేక పోవడం ఆశ్యర్యానికి గురిచేసిందన్నారు. మంత్రాలయం ఆర్‌సీఎన్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల సమావేశంలో మాట్లాడారు. అన్ని పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆదేశించారు. ఎంఈఓలు నాగభూషణం, రాఘన్న, హెచ్‌ఎంలు బోజరాజు, రామాంజనేయులు పాల్గొన్నారు.
వానల్లేక జొన్నపంట తొలగింపు
మద్దికెర: వర్షాలు లేకపోవడంతో ఎండిపోతున్న జొన్న పంటను రైతు మిడుతూరు ప్రతాప్ గురువారం తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మద్దికెర సమీపంలో మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని జూన్‌లో జొన్న సాగు చేశానన్నారు. అడపాదడపా వర్షాలతో పైరు పెరిగా ఆగస్టు నుంచి వానల్లేక ఎండిపోయిందన్నారు. పెట్టుబడి కింద రూ.75,000 ఖర్చు వచ్చిందని, పంట ఎండిపోతుండటంతో పశువులకు మేతగా వస్తుందని తొలగించినట్లు చెప్పారు. అంతర పంటగా వేసిన కంది కూడా ఎండిపోతోందని రాష్ట్ర ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు.
డోన్ ఏఎస్‌ఐ మృతి
డోన్ టౌన్/
కర్నూలు (టౌన్):
డోన్ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తు న్న మద్దిలేటి (56) అనారోగ్య సమస్యలతో గురువారం మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడు తున్న ఆయనను ఇటీవల కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కోలుకొలేక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న డోన్ పట్టణ సీఐ ఇంతియాజ్‌బాషా కర్నూలుకు వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఏఎస్‌ఐ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తండ్రిని చంపిన తనయుడు అరెస్ట్
వెల్దుర్తి: తల్లిని రక్షించే ప్రయత్నంలో తండ్రిని చంపిన తనయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ యుగంధర్, ఎస్‌ఐ నరేశ్ తెలిపిన వివరాల మేరకు.. వెల్దుర్తి పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ షేక్షావలి వివాహేతర సంబంధం విషయంపై అతని భార్య మస్తాన్‌బి శనివారం రాత్రి ప్రశ్నించింది. దీంతో షేక్షావలి తన భార్యను గొంతు పట్టుకోగా ఆమె అరుస్తూనే స్పృహ తప్పింది. తల్లి అరుపులు విన్న అతని పెద్ద కుమారుడు మస్తాన్ వలి క్షణికావేశంలో తండ్రి తలపై రోకలి బండతో బాదాడు. గాయపడ్డ తండ్రిని తనే ఆటోలో ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ షేక్షావలి కోలుకోలేక 6వ తేదీ ఆదివారం మృతి చెందాడు. మృతుని సోదరుడు ఇదురుబాషా 7వ తేదీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసిన పోలీసులు నిందితుడు మస్తాన్‌వలిని గురువారం అతని ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. డోన్ కోర్టులో హాజరు పరిచి, జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ, ఎస్‌ఐ తెలిపారు.
ఇద్దరు నిందితుల అరెస్ట్
ఉయ్యాలవాడ: కాంట్రాక్టర్‌ను బెదిరించి డబ్బులు లాక్కపోయిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ రామిరెడ్డి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. బుధవారం సాయంత్రం కాంట్రాక్టర్ దూదేకుల జమాల్ బైక్‌పై వెళ్తుండగా గ్రామ సమీపంలో కాకరవాడ గ్రామానికి చెందిన ప్రసన్నకుమార్, రవి దాడి చేసి కొట్టి, బెదిరించి రూ. 5 వేలు నగదు దోచుకుని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం ఉయ్యాలవాడ కరెంట్ ఆఫీస్ సమీపంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి బైక్, రూ. 5 వేలు నగదు, రెండు బైక్ స్టీల్ స్టంప్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ విధించారన్నారు.


