బనగానపల్లె రూరల్: బనగానపల్లె జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థిని నుస్త్రత్ భగవద్గీత శ్లోకాల పారాయణ పొటీల్లో రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. పట్టణంలోని ఎన్జీఓ కాలనీలోని ముస్లిం కుటుంబానికి చెందిన గడ్డం మహబూబ్‌బాషా, దిల్‌షాద్‌బేగం దంపతుల కుమార్తె నుస్త్రత్ స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి అభ్యసిస్తున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలు గౌరి ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోకాల పారాయణంపై శిక్షణ పొందారు. ఈ పాఠశాలలోని మొత్తం 22 మంది విద్యార్థినులు ఉపాధ్యాయురాలు గౌరి ఆధ్వర్యంలో గత ఎప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం సుమారు గంట పాటు భగవద్గీత శ్లోకాల పారాయణంలో శిక్షణ తీసుకున్నారు. వీరంతా జూలై 19న వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులోని ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణ భారతదేశ స్థాయి భగవద్గీత పోటీల్లో పొల్గొన్నారు. మొదటి విడత పోటీలకు జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులతో పాటు ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలు రెండు దశల్లో జరిగాయి. మొదటి దశలో 113 మంది విద్యార్థులను, రెండవ విడత భగవద్గీత పోటీలకు ఎంపిక చేయగా ఇందులో జెడ్పి బాలికల ఉన్నత పాఠశాల నుంచి ముస్లిం విద్యార్థిని నుస్త్రత్ పాటు మొత్తం 22 మంది విద్యార్థినులు ఎంపికయ్యారు. రెండవ దశ పోటీలు ఆగస్టు 2వ తేదీన జరిగాయి. భగవద్గీతలోని 108 శ్లోకాల నుంచి విద్యార్థులకు ఉపయోగపడే మొదటి 54 శ్లోకాలను తీసుకొని రెండవ స్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో బనగానపల్లె జెడ్పీ బాలికల పాఠశాల విద్యార్థులు నుస్త్రత్, శృతి ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు అడిగిన శ్లోకాలను దోషరహితంగా, రాగయుక్తంగా, భావయుక్తంగా, శ్రావ్యంగా వినిపించారు. మొదటి బహుమతి రూ.లక్షను నుస్త్రత్ దక్కించుకోగా రెండవ బహుమతిని విద్యార్థిని శృతి గెలుచుకున్నారు. విద్యార్థిని నుస్త్రత్ ముస్లిం మతానికి చెందిన వారైనా భగవద్గీత శ్లోకాల పారాయణంలో ఎలాంటి భయం బెరుకు లేకుండా పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపడంతో బనగానపల్లె ప్రాంత ప్రజలు అభినందిస్తున్నారు. అలాగే విద్యార్థిని నుస్త్రత్ గతేడాది నిర్వహించిన ఎన్‌ఎంఎంఎస్ పరీక్షల్లోనూ ప్రతిభ చాటి కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల పాటు అందించే ఉపకార వేతనానికి ఎంపికై నట్లు హెచ్‌ఎం ప్రసాదరావు తెలిపారు. అలాగే 2024లో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బనగానపల్లె లాల్ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహమ్మద్ ప్రవక్త చరిత్రకు సంబంధించిన క్విజ్ పోటీల్లోనూ పాల్గొని బహుమతి సాధించినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
అసంశయం మహాబాహో మనో
దుర్నిగ్రహం చలమ్‌శ్రీ
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతేశ్రీశ్రీ
భావం: ఓ అర్జునా! చంచలమైన మనస్సును నియంత్రించడం కష్టమనేది నిజమే. కానీ, ‘అభ్యాసం’ అంటే పట్టుదలతో కూడిన నిరంతర సాధన ద్వారా దీనిని కచ్చితంగా సాధించవచ్చు. ఒక విషయాన్ని నేర్చుకోవడంలో రోజువారీ పట్టుదలే అభ్యాసం.
భగవద్గీతలోని ఈ శ్లోకం బనగానపల్లెకు చెందిన ఓ విద్యార్థిని ప్రతిభకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఎందుకంటే భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాల పారాయణ పొటీల్లో ముస్లిం మతానికి చెందిన విద్యార్థిని రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
భగవద్గీత శ్లోకాల పారాయణ పోటీల్లో
రాణిస్తున్న ముస్లిం విద్యార్థిని నుస్త్రత్
దక్షిణ భారతదేశ స్థాయిలో
ఇస్కాన్ నిర్వహించిన పోటీల్లో ప్రతిభ
మొదటి బహుమతి రూ.లక్ష కై వసం
చదువుల్లోనూ ముందంజ


