కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు శిక్షణతో కూడిన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.తులసీదేవి తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కిసాన్ డ్రోన్ ఆపరేటర్స్, అమరరాజా బ్యాటరీస్ మల్టీ స్కిల్ టెక్నీషియన్స్, సోలార్ పీవీ ఇన్‌స్టాలర్(సూర్యమిత్ర) విభాగాల్లో ప్రత్యేక శిక్షణతో వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. కిసాన్ డ్రోన్ ఆపరేటర్స్‌కు అనంతపురంలో 60 రోజుల పాటు శిక్షణ ఉంటుందని, ఇంటర్‌మీడియట్ పాస్/ఫెయిల్, 18 నుంచి 35 సంవత్సరాల్లోపు వయస్సు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అమరరాజా బ్యాటరీస్‌లో శిక్షణకు 10వ తరగతి పాస్/ఫెయిల్, 16 నుంచి 30 సంవత్సరాల్లోపు వయస్సు అభ్యర్థులు అర్హులన్నారు. 80 రోజుల శిక్షణ కాలంలో నెలకు రూ.13,500 స్టైఫండ్ ఇస్తారని, తిరుపతిలో జరిగే ఈ శిక్షణ పూర్తయ్యాక నెలకు రూ.25 వేల జీతం అందుతుందన్నారు. సోలార్ పీవీ ఇన్‌స్టాలర్‌కు కడపలో 80 రోజుల శిక్షణ ఉంటుందని, 18 నుంచి 35 సంవత్సరాల్లోపు వయస్సు ఇంటర్ పాస్/ఐటీఐ డిప్లొమా అభ్యర్థులు అర్హులన్నారు. అలాగే ఇజ్రాయిల్ హోమ్ మెడీకేర్ గివేర్ ట్రైనింగ్‌కు కర్నూలులో 90 రోజుల శిక్షణ ఉంటుందని, వయస్సు 25 నుంచి 45 సంవత్సరాల్లోపు ఉండి ఏఎన్‌ఎం/ జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్/పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు అర్హులన్నారు. వసతి, భోజనం, ఉచిత శిక్షణనిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 9849905973, 7032995543, 9985152215, 8328288152, 8074046533 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.


