మాటున ఇసుక మేటలు! | - | Sakshi
Sakshi News home page

మాటున ఇసుక మేటలు!

Aug 26 2026 1:36 AM | Updated on Aug 26 2026 1:36 AM

యేటేటా అనుభవం.. అంతకు మించి అధికార పార్టీ అండాదండ. ఇంకేముంది ఇసుకంతా వారి వశమే. ఏటికి నీళ్లు రాకమునుపే మేల్కొన్నారు. భారీగా ఇసుకను తరలించి మాటున పోగు చేసేసుకున్నారు. మంత్రాలయం కేంద్రంగా ఇసుక మాఫియా చేసుకున్న అక్రమ నిల్వలపై పరిశీలనాత్మక కథనం..

మంత్రాలయం: తుంగభద్ర నదిలోని ఇసుకంతా కనుమైరుగైంది. ఇసుక మాఫియా ధాటికి తిన్నెలు పోయి గోతులు మిగిలాయి. వేలాది ట్రిప్పుల ఇసుక తరలించడంతో నది స్వరూపమే మారిపోయింది. ఇక్కడి మాఫియా వాన కాలానికి ముందుగానే అక్రమ నిల్వలకు తెర తీసింది. బీడు భూములు, వెంచర్‌ ప్రహరీలలో భారీగా ఇసుక డంప్‌ చేసుకుంది. మాధవరం రోడ్డు అభయాంజనేయ స్వామి పక్కనే ఉన్న సుజయీంద్ర గురుకుల ప్రదేశంలో 7 చోట్ల, అభిముఖంగా ఉన్న రాములోని విగ్రహం ప్రాంతంలో మరో 5 చోట్ల ఇసుకను పోగేసి పెట్టుకున్నారు. ఆ పక్కనే ఓ ప్రైవేటు వెంచర్‌లోని ప్రహరీలో డంపు ఉంది. మంత్రాలయం మండల కేంద్రంలో ట్రాన్స్‌ కార్యాలయం ఎదుట కాంపౌండ్‌, నూతన భవన నిర్మాణాలు జరిగే స్థలాల్లో అక్రమ నిల్వలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. సుజయీంద్ర నగర్‌లోనూ ఈ అక్రమ నిల్వలు ఉన్నాయి. ఇక్కడి మాఫియా విచ్చలవిడి తనానికి నిదర్శనంగా ఇసుక రాశులు దర్శనమిస్తున్నాయి. దాదాపు 1500 ట్రిప్పుల ఇసుక స్థానికంగా నిల్వ ఉంచినట్లు అంచనా.

ధరలకు రెక్కలు తొడిగేందుకు రెడీ

ఏటికి నీళ్లొస్తే ఇక్కడి మాఫియాకు పండగే. నిల్వ చేసిన ఇసుకతో భారీగా వెనకేసుకుంటారు. హోస్పేట్‌ డ్యాం నుంచి తుంగభద్ర నదికి 2 వేల క్యూసెక్కుల నీరు వదిలారు. రేపటితో వరద నీరు మంత్రాలయం చేరుకోనుంది. నీరు రాగానే ఇసుక ధరలకు రెక్కలు తొడుగుతారు. ప్రస్తుతం ట్రాక్టర్‌ టిప్పు ఇసుక మంత్రాలయంలో రూ.1200కు విక్రయిస్తున్నారు. అదే నీరొస్తే ఇసుక ధర ట్రిప్పు రూ.3 వేలకు చేరనుంది. ఇక చిలకలడోణ, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో రూ.4 వేలు టిప్పు ధర కడతారు.

అక్రమ నిల్వలు.. అడిగేదెవరు?

జాతీయ రహదారి పొడవునా అక్రమ ఇసుక నిల్వలు దర్శనమిస్తున్నాయి. మాఫియా ముందుచూపుకు మేటలుగా నిలిచాయి. అడ్డదిడ్డంగా ఇసుక తరలించినా, గుట్టలుగా డంపులు పెట్టుకున్నా ఇక్కడ అడిగే నాథుడు లేడు. కంటి తుడుపుగా తోచినప్పుడు దాడులు చేయడం కుర్చీలకు పరిమితం కావడం అధికారుల వంతైంది. మైనింగ్‌, విజిలెన్స్‌ అధికారులు అర్ధరాత్రి ఆపరేషన్‌లో ఇటీవల మూడు ఇసుక టిప్పర్లను పట్టుకోవడం జరిగింది. సదరు టిప్పర్లకు రూ.1.50 లక్షలు జరిమానా వేశారు. అక్కడి అధికారులు వస్తే తప్పా పెద్దగా రిజల్టు లేని వైనం. ఇప్పటికై నా స్థానిక అధికారులు అక్రమ నిల్వలపై కేసులు నమోదు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మంత్రాలయంలో భారీగా

ఇసుక డంప్‌లు

శ్రీమఠం స్థలాల్లో

ఇబ్బడిముబ్బడిగా నిల్వ

కనిపించినా కానరానట్లు అధికారులు

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

మంత్రాలయం రూరల్‌: ఆలస్యంగా మేల్కొన్న మైనింగ్‌ అధికారులు నామమాత్రంగా ఇసుక అక్రమ రవాణాపై దాడులు చేపట్టారు. మంగళవారం మైన్స్‌ అండ్‌ జియాలజీ ఆఫీస్‌ ఆర్‌ఐ శివపార్వతి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ హసీనా బాను మంత్రాలయంలో తుంగభద్ర నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై దాడులు నిర్వహించారు. దాడుల్లో రెండు ట్రాక్టర్లను మాత్రమే పట్టుకున్నారు. నది నుంచి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లు (ఏపీ 21 టీఈ 2986, ఏపీ 21 టీఆర్‌ 3030)ను స్వాధీన పరుచుకున్నారు. రెండు ట్రాక్టర్లను స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు. ఈ విషయమై డిప్యూటీ డైరెక్టర్‌ నాగిని స్పందిస్తూ త్వరలోనే రెండు ట్రాక్టర్లకు జరిమానా విధిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement