కోడి పందేల స్థావరంపై దాడులు | - | Sakshi
Sakshi News home page

కోడి పందేల స్థావరంపై దాడులు

Aug 26 2026 1:36 AM | Updated on Aug 26 2026 1:36 AM

12 మంది పందెం రాయళ్ల అరెస్ట్‌

రూ.20,600 నగదు,

రెండు పందెం కోళ్లు స్వాధీనం

ఆళ్లగడ్డ: అడ్డూఅదుపు లేకుండా కోడిపందేలు నిర్వహిస్తూ లక్షల్లో పందేలు కాస్తున్న పందెం రాయళ్ల ఆటను రుద్రవరం పోలీసులు కట్టించారు. వ్యవసాయ పొలాల్లో గుట్టుచప్పుడు కాకుండా పందేలు ఆడుతున్న 12 మంది పందెం రాయళ్లను అరెస్ట్‌ చేసినట్లు రుద్రవరం ఎస్‌ఐ జయప్ప తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ముత్తలూరు గ్రామ పొలిమేర పరిధిలోని వ్యవసాయ పొలాల్లో పెద్ద ఎత్తున డబ్బులు బెట్టింగ్‌ పెడుతూ కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్‌ఐ తన బృందంతో కలిసి స్థావరాన్ని చట్టుముట్టారు. పోలీసులను చూసి పందెం రాయళ్లు పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి నరసింహాతో పాటు మరో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు పందెం కోళ్లు, రెండు కత్తులు, మూడు బైకులు, రూ.20,600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మండల పరిధిలో ఇలాంటి చట్టవిరుద్ధమైన జూద క్రీడలు, కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

యువకుడి ఆత్మహత్య

బొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలోని శిల్పా టవర్స్‌లో కేఫ్‌ యజమాని నవీన్‌ (26) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టూటౌన్‌ సీఐ అస్రార్‌ బాషా తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన నవీన్‌ గత రెండేళ్లుగా పద్మావతి నగర్‌లో గోదావరి కేఫ్‌ నిర్వహిస్తున్నారు. సోమవారం పని ముగించుకుని తాను నివాసముంటున్న ఎస్‌బీఐ కాలనీలోని శిల్పా టవర్స్‌కు వెళ్లాడు. తల్లితో పాటు భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి వంట గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. వేకువజామున మంచినీళ్లు తాగటానికి నవీన్‌ తల్లి వంటగదివైపు వెళ్లగా ఫ్యాన్‌కు మృతదేహం వేలాడుతూ కనిపించింది. గట్టిగా కేకలు వేయటంతో స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకూ పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

కండక్టర్‌ సహా ఆరుగురికి గాయాలు

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొట్టి రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మంగళవారం పట్టణ శివారులో చోటు చేసుకుంది. వివరాలు.. ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు మంగళవారం ప్రొద్దుటూరుకు బయలుదేరింది. కొన్ని నిమిషాల్లోనే హైవే నుంచి సర్వీస్‌ రోడ్డుకు దిగుతుండగా అదుపుతప్పి బ్రిడ్జి సైడ్‌ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనతో రోడ్డు సైడుకు వెళ్లడంతో ఒకవైపు టైర్లు బురుదలో కూరుకుపోయి బస్సు గుంతలో దిగబడింది. ప్రయాణికులు భయాందోళనతో గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల పొలాల్లో ఉన్న వారు వచ్చి వారిని బయటకు తీసి 108 అంబులెన్స్‌లో పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంలో కండక్టర్‌ కమలమ్మతో పాటు మరో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ పోలీసులు డ్రైవర్‌ బెనర్జీ, కండక్టర్‌ కమలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement