దొర్నిపాడు మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన అక్కల రవి భూములను కౌలుకు తీసుకొని పత్తి విత్తనోత్పత్తి చేపట్టాడు. పంట పండక మానసికంగా దెబ్బతిని 2024 డిసెంబరులో మృతి చెందాడు. తండ్రి మృతి, కొండలాగా ఉన్న అప్పుల బాధలు భరించలేక అక్కల రవి కుమారుడు కరుణాకర్ 2025 మార్చి 4న పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధలు తండ్రి, కుమారులను బలి తీసుకున్నాయి. ఒకవైపు భర్త, మరోవైపు చేతికి వచ్చిన కుమారుడు మరణించడంతో అక్కల రవి భార్య అక్కల రాణి ఒంటరిగా మిగిలిపోయారు.
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయం కలసిరాక.. అప్పుల తీర్చే మార్గం కనిపించక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వీరి కుటుంబాలు వీధిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంది. చంద్రబాబు సర్కార్ ఏర్పాటు తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో 116 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి కుటుంబాలను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాని చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోవడంలో చేతులెత్తేసింది. రైతు ఆత్మహత్యలపై మండల స్థాయి అధికారులైన సబ్ ఇన్స్‌పెక్టర్, తహసీల్దారు, వ్యవసాయ అధికారి ధ్రువీకరిస్తూ ప్రాథమిక రిపోర్టులు పంపిస్తారు. దీనిపై త్రీమెన్ కమిటీ విచారణ జరుపాలి. త్రీమెన్ కమిటీలో ఏడీఏ, ఆర్‌డీవో, డీఎస్‌పీలు ఉంటారు. త్రీమెన్ కమిటీ సైతం రైతులు ఆత్మహత్యలను ధ్రువీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ ద్వారా నివేదికలు వ్యవసాయ శాఖ కమిషనర్‌కు పంపుతున్నారు. ఈ నివేదికలన్నీ వ్యవసాయ శాఖ కమిషనర్ దగ్గర మరుగున పడిపోతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 2024 జూన్ తర్వాత 116 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడితే ఒక్క కుటుంబానికి కూడా పరిహారం చెల్లించలేదు.
నాటి పరిస్థితులే నేడు
‘వ్యవసాయం ఎందుకు దండగ’ అంటూ ఒకప్పుడు చంద్రబాబు అన్నారు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత రావడంతో 2014, 2019, 2024 ఎన్నికల్లో రైతు సంక్షేమం అంటూ కొత్తపల్లవి ఎంచుకున్నారు. అయినా 2014 నుంచి 2019 వరకు 321 రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ పరంపర 2024 జూన్ నుంచి మళ్లీ ఊపందుకుంది. అనావృష్టితో 2024–25లో, అతివృష్టితో 2025–26లో, ఎల్‌నీనోతో 2026–27లో వ్యవసాయం కలసి రాలేదు. చంద్రబాబు 26 నెలల పాలనలో కర్నూలు జిల్లాలో 64, నంద్యాల జిల్లాలో 52 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చంద్రబాబు సర్కార్ ఏర్పాటు తర్వాత వ్యవసాయం దండగ అనే మాట నిజం అవుతోందని రైతులు పేర్కొంటున్నారు.
పెండింగ్‌లో నివేదికలు
కర్నూలు జిల్లాలో 32 మంది రైతులకు పరిహారం చెల్లించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉండిపోయాయి. మరో 15 మంది రైతు ఆత్మహత్యలకు సంబంధించిన నివేదికలు వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో పెండింగ్‌లో ఉండిపోయాయి. మిగిలిన 17 మంది రైతు ఆత్మహత్యలపై విచారణ మండల వ్యవసాయ అధికార, తహసీల్దారు, ఆర్‌డీవో దగ్గర పెండింగ్‌లో ఉంది. నంద్యాల జిల్లాలో 37 మంది రైతులకు పరిహారం అందించే నివేదికలు కమిషనరేట్‌లో పెండింగ్‌లో ఉండిపోయాయి. ఆర్‌డీవో దగ్గర ఒకటి, తహసీల్దార్ల దగ్గర 12 పెండింగ్‌లో ఉన్నాయి. రెండింటికి అర్హత ఉన్నా తిరస్కరించారు. చంద్రబాబుతో సహా మంత్రులు, టీడీపీ నేతల మాటల్లోనే రైతుల సంక్షేమం ఉంటుంది తప్ప చేతల్లో ఉండదనే విమర్శలు వస్తున్నాయి. మృతిచెందిన రైతుల భార్యలకు వితంతువు పింఛన్లు మంజూరు చేయాలని ప్రజా సంఘాల నేతలు సూచిస్తున్నారు.
పరిహారం..పరిహాసం!
టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 వరకు రైతుల ఆత్మహత్యలకు పాల్పడిన కొన్ని కుటుంబాలకు రూ.5 లక్షలు చెల్లించారు. మృతిచెందిన రైతుకు చెందిన నామిని, సంబంధిత తహసీల్దారుతో ప్రారంభించిన జాయింట్ ఖాతాలో పరిహారం జమ చేసేవారు. ఇందులో కొంత మొత్తం అప్పులకు చెల్లించాలని చెప్పేవారు. మిగిలిన మొ త్తం వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. జాయింట్ అకౌంటులో ఉండటంతో తహసీలార్లు దయ చూపాల్సి వచ్చేది. అప్పట్లో ఆత్మహత్యలకు పాల్పడిన 180 కుటుంబాలకు పరిహారం చెల్లించలేదు.
వైఎస్సార్‌సీపీ హయాంలో భరోసా
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. మృతి చెందిన రైతు నామినీ బ్యాంకు ఖాతాకు నేరుగా పూర్తి పరిహారాన్ని జమ చేసింది. త్రీమెన్ కమిటీ రిపోర్టు అందిన నెల రోజుల్లోపే పరిహారం విడుదల అయ్యేది. ఇది రైతు కుటుంబాల్లో ఆత్మస్ధైర్యాన్ని నింపింది. అంతేగాక ఉచిత పంటల బీమా అమలు చేసి ప్రతి ఏటా పరిహారం అందించింది. పంటలకు ధరలు పడిపోయిన పక్షంలో మద్దతు ధరతో కొనుగోలు చేసింది. ఫలితంగా రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. దురదృష్టవశాత్తు బలవన్మరణాలకు పాల్పడిన రైతు కుటుంబాలకు మూడు నెలల్లోపే రూ.7 లక్షల చొప్పున పరిహారం అందేది.
రుణమాఫీ పేరుతో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తూతూమంత్రంగా చేశారు. ఫలితంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకపోయారు. రైతు సంక్షేమం అంటూ 2019 ఎన్నికల్లో ఎన్నో మాటలు చెప్పినప్పటికీ చంద్రబాబును నమ్మలేదు. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు సాయం అందిస్తామని 2024 ఎన్నికల్లో ప్రకటించి మోసం చేశారు. కర్నూలు జిల్లాలో పత్తి, వేరుశనగ, ఆముదం, మొక్కజొన్న, ఉల్లి, మిర్చి, నంద్యాల జిల్లాలో వరి, మినుము, మొక్కజొన్న, పత్తి విత్తనోత్పత్తి, వేరుశనగ తదితర పంటలు దెబ్బతిన్నా పరిహారం ఇవ్వలేదు. అరకొర వచ్చిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. కనీస మద్దతు ధరతోనైన అమ్ముకునే అవకాశం కూడా లేకుండా పోయింది. అదీ గాక పంటల బీమా జాడే లేకుండా పోయింది. మోసం మొలకెత్తడం, అప్పులు కొండలా కనిపించడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
అక్కల రాణి


