కర్నూలు కల్చరల్: బనగానపల్లె మండలంలోని యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ ఆలయ నిర్మాణం అద్భుతం. ఆలయ సందర్శనకు, యాగంటి బసవన్నను చూడడానికి మన రాష్ట్రంలోని భక్తులతో పాటు దేశ, విదేశాల నుంచి సైతం ప్రజలు వస్తుంటారు. సెంట్రల్ ఆర్కియాలజీ పరిధిలో ఆలయం ఉంది. ఆలయంలో ఎలాంటి నిర్మాణ పనులు, మరమ్మతులు చేపట్టాలన్నా, ఆలయ ఆవరణ చుట్టూ 300 మీటర్ల పరధిలో పనులు చేయాలన్నా ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ అనుమతి తప్పని పరిస్థితి. ఇదంతా బాగానే ఉన్నా.. ఇటీవల ఆలయ పరిసర ప్రాంతంలో గదులు, నిత్యాన్నదాన సత్రం, షాపింగ్ కాంప్లెక్స్ తదితర పనులు జరగుతున్నాయి. ఆలయ అభివృద్ధిలో భాగంగానే వివిధ రకాలు పనులు చేపట్టామని దేవదాయశాఖ అఽధికారులు చెబుతున్నా ఇదంతా స్థానిక ప్రజాప్రతినిధి, మంత్రి అండదండలతోనే సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. అధికార బలంతో నిబంధనలను తుంగలో తొక్కి పనులు చేపడుతున్నట్లు ఆరోపణలున్నాయి.
పిటిషన్ వేసిన రైతులు
యాగంటి దేవాలయంలో బ్లాస్టింగ్, డ్రిల్లింగ్, ఆలయ నిర్మాణంలో మార్పులు/ రెనోవేషన్ పనులు సంబంధిత అఽధికారుల అనుమతులు లేకుండా చేస్తున్నారని ఆ ప్రాంతానికి చెందిన నలుగురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా పురాతన ఆలయ నిర్మాణంలో మార్పులు చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్లు వాదించారు. ఆలయంలో జరుగుతున్న నిర్మాణ, మార్పుల పనులను పరిశీలించాలని, అవసరమైన అనుమతులు లేకుండా పనులు చేయకుండా చేడాలని, ఏఎమ్‌ఏఎస్‌ఆర్ యాక్ట్, ఏపీ ఎండోమెంట్ యాక్ట్ కింద ఉల్లంఘనలు ఉంటే చర్యలు తీసుకోవాలని, దీంతో పాటు అదనంగా కేసు తుది నిర్ణయం వచ్చే వరకు గర్భగుడిలో నిర్మాణ పనులు చేయకూడదని, ఆలయం చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్లాస్టింగ్, డ్రిల్లింగ్ చేయకూడదని మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ఆలయం అధికారులు తాము ఆలయాన్ని ధ్వంసం లేదా బ్లాస్టింగ్ చేయడం లేదని భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు కొన్ని మార్పులు మాత్రమే చేశామని కోర్టుకు తెలిపారు. అయితే ఆ పనులకు సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతులు, ఆమోదాలు తీసుకున్నట్లు ఆధారాలు లేవని కోర్టు రికార్డుల్లో ఉంది. అలాగే అప్పటికే పనులన్నీ పూర్తయ్యాయని, ప్రస్తుతం జరగడం లేదని ఆలయం తరుపు అధికారులు తెలిపారు.
యాగంటీశ్వరాలయం అభివృద్ధిలో భాగంగానే నిర్మాణ పనులు చేపడుతున్నాం. రెండింటికి మాత్రమే కోర్టు స్టేటస్‌కో ఉంది. అయినా పరిపాలన, టెక్నికల్ అనుమతులతోనే పనులు చేపట్టాం. త్వరలోనే నిత్యాన్నదానాన్ని ప్రారంభించనున్నాం. అందు కోసం రూ.1.25 కోట్లతో నిత్యాన్నదాన సత్రం నిర్మిస్తున్నాం. భక్తులకు సౌకర్యాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నాం.
– పాండురంగారెడ్డి, ఇన్‌చార్జ్ ఈఓ,
యాగంటీశ్వరాలయం
హైకోర్టు స్టేటస్‌కో ఉన్నప్పటికీ..
రైతుల పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆలయం అధికారుల వాదనను విన్న తరువాత మే 4న ఉన్న పరిస్థితినే (స్టేటస్ కో) తదుపరి విచారణ తేదీ వరకు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించి అక్కడ పనులు జరుగుతున్నట్లు రైతులు చెబుతున్నారు. హైకోర్టు స్టేటస్ కో, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారి నోటీస్‌లు ఉన్నప్పటికీ నిర్మాణ పనులు రాత్రిపూట చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
యాగంటీశ్వర ఆలయ ఆవరణలో
అడ్డదిడ్డంగా నిర్మాణ పనులు
ఆలయం ప్రాశస్త్యం దెబ్బతింటుందని
పిటిషన్ వేసిన భక్తులు
హైకోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులు ఉన్నా
నిర్మాణ పనులు
రాత్రిళ్లు సైతం కొనసాగుతున్న వైనం
స్వయంగా పనులు పర్యవేక్షిస్తున్న
ఆలయ ఈవో


