కోడుమూరు రూరల్: ప్యాలకుర్తి గ్రామంలోని ఓ ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే.. ప్యాలకుర్తికి చెందిన గొల్ల శ్రీనివాసులు ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తుంటాడు. శనివారం రాత్రి భార్య శ్రావణితో కలిసి కింది ఇంట్లోని బెడ్‌రూంలో పడుకోగా పిల్లలిద్దరు మిద్దైపెన గదిలో పడుకున్నారు. దుండగులు ఇంటి బయట వేసిన తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించి శ్రీనివాసులు నిద్రిస్తున్న గదికి, పైన పిల్లలు నిద్రిస్తున్న గదికి బయట నుంచి గడియ పెట్టారు, తర్వాత మరో గదిలోకి వెళ్లి బీరువాను బద్దలుకొట్టి నాలుగుతులాల బంగారం, 10తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. తెలవారుజామున గొల్ల శ్రీనివాసులు రూమ్ తలుపు తీసేందుకు యత్నించగా రాకపోవడంతో అనుమానంతో సోదరుడికి ఫోన్ చేయగా ఆయన వచ్చి తలుపులు తీశాడు. అనంతరం శ్రీనివాసులు ఇంట్లోని బీరువాను పరిశీలించగా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బంగారం, వెండి ఆభరణాలు కనిపించలేదు. చోరీ జరిగిందని నిర్ధారించుకొని ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ ఎర్రిస్వామి గ్రామాన్ని చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
కుందూలో చేపల మృత్యువాత
కోవెలకుంట్ల: తీవ్రవర్షాభావ పరిస్థితుల కారణంగా కుందూనదిలో నీరు అడుగంటడం, అరకొరగా ఉన్న నీరు కలుషితం కావడంతో వేలాది చేపలు మృతిచెందాయి. కోవెలకుంట్ల మండలంలోని కలుగొట్ల సమీపంలో కుందూనదితీరం వెంట ఆదివారం ఉదయం మృతిచెందిన చేపలు కనుచూపు మేరలో కొట్టుకొచ్చాయి. నెల రోజుల నుంచి నదిలో నీటి ప్రవాహం నిలిచిపోయింది. అక్కడక్కడగా నది గుంతలేర్పడి, గండ్లు ఉన్న ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిలో చేపలు అధిక సంఖ్యలో ఉన్నాయి. నది ఎగువ ప్రాంతాల్లో వివిధ ఫ్యాక్టరీల నుంచి కలుషిత వ్యర్థాలను నదిలోకి వదలడంతో చేపలు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. గ్రామస్తులు ఉదయం నది వద్దకు వెళ్లి చూడగా చనిపోయిన చేపలు గుట్టలుగా పడి ఉండటాన్ని గమనించారు. ఫ్యాక్టరీ వ్యర్థాలతో చేపలు చనిపోవడంతో వాటిని ఎవరు తీసుకెళ్ల లేదు. దీంతో నది తీరం వెంబడి చనిపోయిన చేపలు కనిపిస్తున్నాయి.
వివాహిత ఆత్మహత్య
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని మిలటరీ కాలనీలో బోయ నాగలక్ష్మి (46) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాలు..పట్టణంలోని సోమప్ప నగర్‌లో మృతురాలి కుమారుడు జయరాముడు, కోడలు జమున ఉంటారు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇటీవల జయరాముడితో గొడవపడి జమున పుట్టింటికి వెళ్లిపోయారు. దీంతో అతను మద్యానికి బానిస అయ్యారు. ఈ విషయంలో తీవ్ర మనస్థాపం చెందిన తల్లి నాగలక్ష్మి మిలటరీ కాలనీలోని ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే వారు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త రామాజంనేయుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్‌ఐ కిష్టప్ప తెలిపారు.
రైలు కింద పడి యువకుడి బలవన్మరణం
మంత్రాలయం రూరల్: రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ శివ రామయ్య తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని కాచాపురం గ్రామానికి చెందిన బలిజ అనిల్‌కుమార్ (27) తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. అమ్మమ్మ అంజినమ్మ దగ్గర పెరిగి పెద్దవాడయ్యాడు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఈయువకుడు తాగుడుకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం 2.30 గంటల సమయంలో 12627 ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ వెల్లడించారు.
నేడు డయల్ యువర్ సీఎండీ, ఎస్‌ఈ
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం ఈ నెల 17వ తేదీ జరుగుతుందని కర్నూలు సర్కిల్ సూపరింటెండింట్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వినియోగదారులు కూడా నేరుగా 89777 16661కు ఫోన్ చేసి సీఎండీ దృష్టికి సమస్యలు తీసుకెళ్లవచ్చునన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్‌లో కూడా సోమ వారం డయల్ యువర్ ఎస్‌ఈ(73826 14308) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


