దొర్నిపాడు మండలం భాగ్యనగరం గ్రామానికి చెందిన రాగుల నాగేంద్ర కౌలుకు తీసుకున్న భూముల్లో పత్తి విత్తనోత్పత్తి చేపట్టారు. పంట చేతికి రాక తలకు మించిన అప్పులు చుట్టుముట్టాయి. అప్పుల బాధతో 2024 ఆగస్టు 4న ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ యార్డులో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయనకు భార్య లక్ష్మిదేవి, కుమారుడు నాగశేషు, కూతురు యామిని ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణించడంతో పిల్లల చదువులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. గ్రామస్తులు చొరవ తీసుకొని నాగశేషును పదో తరగతి చదివిస్తున్నారు. రెక్కల కష్టంతో రాగుల లక్ష్మిదేవి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వానికి దయ కలగలేదు. ఇంత వరకు పరిహారం ఇవ్వలేదు.


