● ఎల్లెల్సీ గేట్లు మూసివేత
హాలహర్వి: టీబీ డ్యాం నుంచి తుంగభద్ర దిగువ కాలువకు విడుదల చేసిన నీరు కర్నూలు జిల్లాకు రాకుండా గేట్లను మూసివేశారు. ఎల్లెల్సీలో ప్రస్తుతం ప్రవహిస్తున్న నీరు కర్ణాటక వాటా అని చెబుతున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చుక్కనీరు రాకుండా 121వ కి.మీ. వద్ద కాలువ గేట్లను పూర్తిగా కిందకు దించేశారు. అలాగే 155వ కి.మీ. వద్ద కాలువ గర్భంలో పూర్తిగా మట్టి, ఇసుక సంచులతో అడ్డుకట్ట వేశారు. బాపురం సరిహద్దు వద్ద (158వ కి.మీ.) గేట్లను పూర్తిగా మూసివేశారు. ఇదిలా ఉండగా కర్ణాటక వాటా నీటితో కర్నూలు జిల్లా రైతులను ఆదుకుంటామని, వాగ్వాదాలు చేసుకోవద్దని కర్ణాటక మంత్రి నాగేంద్ర సోదరుడు ప్రసాద్ చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు పురుషోత్తంగౌడ్ ఆధ్వర్యంలో పకడ్బందీగా అడ్డుకట్టలు వేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది. ఏపీ జలవనరుల శాఖ అధికారులు, తుంగభద్ర బోర్డు ప్రతినిధులు తక్షణమే కర్ణాటక అధికారులతో చర్చలు జరిపి గేట్లు తెరిపించాలని రైతులు కోరుతున్నారు. పంటలకే కాదు, కనీసం తాగడానికి కూడా గుక్కెడు నీరు రాని దయనీయ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


