కర్నూలు: ర్యాగింగ్ విద్యార్థి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసే అమానుష చర్య అని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కర్నూలు న్యాయ విజ్ఞాన వేదిక, వివేకానంద యువ ఫోరం సంయుక్తంగా జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో బుధవారం యువతలో సామాజిక బాధ్యత అనే అంశంపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీనియర్లు జూనియర్లకు మార్గదర్శకంగా నిలవాలి తప్ప ర్యాగింగ్ పేరుతో వేధించడం తగదన్నారు. మాదక ద్రవ్యాల వలలో పడితే యువత భవిష్యత్తు అంధకారం కావడమే కాకుండా వారి కుటుంబానికి, సమాజానికి తీరని నష్టమని హెచ్చరించారు. అన్యాయానికి గురైన వారు, బాధితులు టోల్‌ఫ్రీ నంబర్ 15100 ద్వారా లేదా దగ్గర్లోని న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు. ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. చివరలో విద్యార్థులచే ర్యాగింగ్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.శ్రీనివాసరావు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.


