కర్నూలు(హాస్పిటల్): స్టైఫండ్ పెంచాలని కోరుతూ చేపట్టిన సమ్మెలో భాగంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జూనియర్ డాక్టర్లు బుధవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఏపీ జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆసుపత్రిలో ర్యాలీ నిర్వహించి స్టైఫండ్ పెంచాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం ఓల్డ్ సీఎల్‌జీ ముందు ఏర్పాటు చేసిన శిబిరంలో రిలే దీక్షలు ప్రారంభించారు. మొదటి రోజు రిలే దీక్షలో సంఘం అధ్యక్షుడు డాక్టర్ టి.నిశాంత్, జూనియర్ వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నిశాంత్ మాట్లాడుతూ.. సమ్మె ప్రారంభించి రెండు రోజులైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని, ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.


