బకాయిలకు శ్వేతచీటి! | - | Sakshi
Sakshi News home page

బకాయిలకు శ్వేతచీటి!

Aug 9 2026 1:52 AM | Updated on Aug 9 2026 1:52 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు పీఆర్‌సీ, ఐఆర్‌, డీఏలు ఎగ్గొట్టేందుకే శ్వేతపత్రం విడుదల చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయం మొత్తం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల జీతభత్యాలకే సరిపోతుందని ప్రకటించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉద్యోగుల ప్రయోజనాలకు గండికొట్టడం, ఉద్యోగులపై ప్రజలను రెచ్చగొట్టడమే శ్వేతపత్రం ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌లను సాధించుకునే విషయంలో ఇటీవల కాలంలో ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కుతున్న నేపధ్యంలో శ్వేతపత్రం విడుదలలో కుట్ర, కుతంత్రాలు ఉన్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ల సాధన కోసం ఉద్యమ బాట పట్టాయి. శ్వేతపత్రం విడుదల తర్వాత చంద్రబాబు సర్కార్‌పై ఏపీ జేఏసీ, ఏపీఎన్‌జీజీవోస్‌ అసోసియేషన్‌న్‌ నాయకులు విరుచుకపడుతున్నారు. ముఖ్యమంత్రిని ఒప్పించి డిమాండ్‌లను నెరవేర్చాలని టీడీపీ ఎంపీకి, ఎమ్మెల్యేలకు, టీడీపీ నేతలకు వినతిపత్రాలు ఇస్తున్నారు.

దిక్కులు చూసే పరిస్థితి

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2024 మార్చి నాటికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్ల బకాయిలన్నిటినీ చెల్లించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులు దిక్కులు చూసే పరిస్థితి ఏర్పడింది. వేతనాలు మాత్రం ఒకటి, రెండు తేదీల్లో పడుతున్నాయని, బకాయిలన్నీ పేరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నెల రోజుల్లోనే రికార్డు స్థాయిలో 27 శాతం మధ్యంతర భృతి ప్రకటించారు. 2024 మార్చి నాటికి ఉద్యోగుల బబకాయిలన్నీ చెల్లించగా ఒక్క డీఏ కూడా పెండింగ్‌లో లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై 26 నెలలు అవుతున్నా ఉద్యోగులకు ఒక్క డీఏ మాత్రమే ఇచ్చారు. గత నెల 22న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలో మంత్రుల కమిటీ సమావేశమై..ముఖ్యమంత్రికి నివేదిస్తామని చెప్పడం మినహా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.

ఎంపీఈవోలపై నిర్లక్ష్యం!

రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం రెగ్యులర్‌ నియామకాలకు స్వస్తి పలికి కాంట్రాక్ట్‌ పద్ధతిపై ఎంపీఈఓలను నియమించింది. కర్నూలు జిల్లాలో 200 మంది, నంద్యాల జిల్లాలో 160 మంది పనిచేస్తున్నారు. వీరు ఐదు నెలలుగా వేతనాలు లేకుండానే పనిచేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వీరికి వేతనాలు చెల్లించడంలో జాప్యం జరుగలేదు. ఎంపీఈఓలను కొనసాగిస్తూ ప్రతి ఏటా జీఓ ఇవ్వాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఏడెనిమిది నెలలు ఆలస్యంగా ఇస్తోంది. వేతనాల విషయంలో జాప్యం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కి ఎంపీఈఓలు ఆందోళనలు చేపడుతున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ప్రధాన డిమాండ్లు ఇవీ..

రూ.20 వేల లోపు వేతనాలు పొందుతున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలి.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019లోనే 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చింది. వెంటనే 12వ వేతన సవరణ చేసి మధ్యంతర భృతి ఇవ్వాలి.

26 నెలల్లో ఉద్యోగులకు ఇచ్చింది కేవలం ఒక్క డీఏ మాత్రమే. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు ఇవ్వాలి.

పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సరండర్‌ లీవ్‌లకు వెంటనే డబ్బులు ఇవ్వాలి.

ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పూర్తిగా నిలిచిపోయింది. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని పునర్‌ వ్యవస్థీకరించాలి.

కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి.

నిరాశనే మిగిలింది

కర్నూలు జిల్లాలో ట్రెజరీల నుంచి వేతనాలు పొందేవారు 25,859, నంద్యాల జిల్లాలో 20,282 ప్రకారం ఉమ్మడి జిల్లాలో 46,177 మంది ఉన్నారు. పబ్లిక్‌ సెక్టారు ఉద్యోగులు మరో 10 వేల మంది వరకు ఉంటారు. వీరందరూ చంద్రబాబు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు ఒక్క ఉమ్మడి జిల్లాలోనే రూ.3000 కోట్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. చంద్రబాబు సీఎం అయితే తమ సమస్యలన్నీ పరిష్కారమవుతాయనుకున్న ఉద్యోగులకు నిరాశనే మిగిలింది. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ పంథాలోకి వెళ్లాయి. ఏపీ జేఏసీ, ఏనీ ఎన్‌జీజీవోస్‌ అసోషియేషన్‌ నాయకులు కూడా ఆందోళన చేస్తున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు కదం తొక్కుతున్నారు. ఎంపీఈఓలు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు.

శ్వేతపత్రం విడుదలపై

ఉద్యోగుల్లో ఆగ్రహం

ఆందోళన చేస్తున్న

ఉపాధ్యాయ సంఘాలు

పీఆర్‌సీ, ఐఆర్‌, డీఏలు

ఎగ్గొట్టేందుకే అని విమర్శలు

ఇప్పటికే పెండింగ్‌లో

ఐదు సరండర్‌ లీవ్‌లు

ఏప్రిల్‌ 1 నుంచి ఆగిపోయిన

మెడికల్‌ రీయిబర్స్‌మెంట్‌

ప్రధాన డిమాండ్ల ఊసే లేని వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement