కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే meekosam.a p.gov.in అనే వెబ్‌సైట్‌లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
శ్రీశైలానికి తగ్గిన వరద
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైల జలాశయంలోకి జూరాల ప్రాజెక్టు నుంచి వచ్చే వరద ప్రవాహం తగ్గింది. శుక్రవారం నుంచి శనివారం వరకు శ్రీశైలానికి 2,11,632 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. శనివారం సాయంత్రం నాటికి ఇన్‌ఫ్లో 1,68,020 క్యూసెక్కులకు పడిపోయింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్టులకు 47,278 క్యూసెక్కుల నీరు విడుదలైంది. విద్యుత్ ఉత్పత్తి అనంతరం నాగర్జునసాగర్‌కు 37,141 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,133 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 8వేల క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజల స్రవంతికి 875 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శనివారం జలాశయంలో 176.7402 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 877.70 అడుగులకు చేరుకుంది.


