అవయవ మార్పిడికి అస్వస్థత! | - | Sakshi
Sakshi News home page

అవయవ మార్పిడికి అస్వస్థత!

Aug 9 2026 1:52 AM | Updated on Aug 9 2026 1:52 AM

కర్నూలు జీజీహెచ్‌లో అనుమతి ఉన్నా జరగని ఆపరేషన్లు

ఇప్పటి వరకు ఐదుగురికి కిడ్నీ మార్పిడి

వీరిలో ఓ వ్యక్తి కోలుకోలేక మృతి

ఇన్‌ఫెక్షన్లకు కేంద్రాలుగా ఆపరేషన్‌ థియేటర్లు

సరైన చర్యలు తీసుకోని అధికారులు

మరోవైపు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో ఆపరేషన్లు

కర్నూలు(హాస్పిటల్‌): ఒకరి అవయవదానం మరో ఎనిమిది మందికి ప్రాణదానం చేస్తుందని చెబుతారు. ఈ విషయాన్ని బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి కుటుంబసభ్యులకు నచ్చజెప్పి అవయవదానం చేసేలా ఒప్పిస్తున్నారు. ఈ మేరకు బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి నుంచి అవయవాలను సేకరించి అవసరమున్న వ్యక్తులు, ప్రాంతాలకు పంపిస్తున్నారు. అయితే ఇదంతా జరుగుతున్న ప్రైవేటు రంగంలో మాత్రమే. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మాత్రం అరకొర వసతులు, సౌకర్యాలు ఉండటంతో ప్రక్రియ సాగడం లేదు. ఈ మేరకు అక్కడి వైద్యులు సైతం అవయవమార్పిడి ఆపరేషన్లకు ముందుకు రావడం లేదు.

కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో..

అవయవదానమంటే అదేదో మనిషి బతికున్నప్పుడే వారిలోని అవయవాలను సేకరించి ఇతరులకు అమరుస్తారన్న అపోహ ఇప్పటికీ చాలా మందికి ఉంది. దీంతో పాటు అవయవాలను దానం చేస్తే దాత ఆత్మక్షోభిస్తుందని చాలా మంది భావిస్తుంటారు. అందుకే అవయవదానం చేసే అవకాశం ఉన్నా కుటుంబసభ్యులు ముందుకు రావడం లేదు. అవయవదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి అవయవాలను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున జీవనదాన్‌ ట్రస్ట్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీలు అవగాహన కల్పిస్తున్నాయి. ఈ మేరకు అవయవ మార్పిడికి అవకాశం ఉన్న ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా బృందాలను నియమించి దాత కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి అవయవదానం చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఈ మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు కిమ్స్‌ హాస్పిటల్‌, మెడికవర్‌ హాస్పిటల్‌లలో అవయవాల సేకరణ, మార్పిడిలకు అనుమతి లభించింది. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఇందుకు సంబంధించి ప్రక్రియ జోరుగా సాగుతోంది.

బ్రెయిన్‌డెత్‌ కూడా డిక్లేర్‌ చేయడం లేదు!

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతి నెలా వంద నుంచి 120 దాకా వివిధ ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై చికిత్స కోసం వస్తుంటారు. వీరితో పాటు స్ట్రోక్‌తోనూ తీవ్ర అనారోగ్యపరిస్థితిల్లో ప్రతి నెలా 80 నుంచి 90 మంది దాకా చికిత్స పొందుతుంటారు. వీరిలో కొందరు బ్రెయిన్‌డెత్‌ అయ్యే అవకాశం ఉంది. ఆసుపత్రికి వచ్చిన కాసేపటిలోగా మరణించిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిల్లో రోగి బ్రెయిన్‌ డెత్‌ నిర్ధారించేందుకు అవసరమైన కమిటీ ఉంది. అందులో న్యూరోసర్జరీ, న్యూరాలజీ, అనెస్తీషియా, జనరల్‌ మెడిసిన్‌ వైద్యులతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఛైర్మన్‌గా ఉంటారు. వీరు బ్రెయిన్‌ డెత్‌ నిర్ధారిస్తే ఆ వ్యక్తి అవయవాలను సేకరించి అవసరమైన వారికి అందించవచ్చు. కానీ బ్రెయిన్‌డెత్‌ను సైతం నిర్ధారించేందుకు కొందరు వైద్యులు ముందుకు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కాగా బ్రెయిన్‌డెత్‌ అయిన వారి కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి అవయవదానం చేసేలా ఒప్పించేందుకు అవసరమైన ట్రాన్స్‌ప్లాంట్‌ కో ఆర్డినేటర్లు ఇద్దరు ఉన్నారు. ప్రస్తుతం వీరికి సైతం పని లేకుండా ఉంటోంది.

ఆపరేషన్‌ థియేటర్లలో ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం !

ఆసుపత్రిలో 24కు పైగా చిన్న పెద్దా ఆపరేషన్‌ థియేటర్లు ఉన్నాయి. ఆయా థియేటర్లను నిర్వహించేందుకు నిపుణులైన 18 మంది అనెస్తెటిస్ట్‌లు ఇక్కడ ఉన్నారు. ఒక్కో థియేటర్‌కు ఒక్కొక్కరు ఇన్‌చార్జ్‌గా ఉంటున్నారు. వీరితో పాటు ప్రతి థియేటర్‌కు శిక్షణ పొందిన స్టాఫ్‌నర్సులను సైతం డ్యూటీలో నియమిస్తారు. వీరంతా సంబంధిత థియేటర్‌లో ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌కు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. థియేటర్‌లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా చెప్పులతో పాటు డ్రెస్‌ కూడా మార్చుకుని వెళ్లాల్సి ఉంటుంది. కానీ కొందరు వైద్యులు, వైద్య విద్యార్థులు యథేచ్ఛగా థియేటర్‌లోకి బయటకు తిరుగుతున్నా ఏ ఒక్కరూ అడిగే సాహసం చేయడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే పలు ఆపరేషన్‌ థియేటర్లలో ఇన్‌ఫెక్షన్‌ రేటు అధికమై పలుమార్లు ఆపరేషన్లు వాయిదా పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

అవయవదాన మార్పిడికి అనుమతి తెచ్చుకున్న కర్నూలులోని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారికి అవయవాల సేకరణ, మార్పిడి ప్రక్రియ జోరుగా సాగుతోంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మాత్రం ఇప్పటి వరకు ఒకరికి మాత్రమే కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేశారు. ఇలా కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్న వ్యక్తి సైతం కొంత కాలానికి కోలుకోలేక మృతి చెందాడు. దీని తర్వాత మరో నలుగురికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేశారు. కాగా గతంలో బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి ఓ వ్యక్తి నుంచి అవయవాలను సేకరించి ఒక వ్యక్తికి కిడ్నీ మార్పిడి చేసి, ఇతర అవయవాలను ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. నాలుగేళ్లుగా ఇప్పటి వరకు ఒక్కటి కూడా అవయవమార్పిడి ఆపరేషన్‌ జరగలేదు. ఆసుపత్రిలో కిడ్నీ, గుండె, ఊపిరితిత్తుల మార్పిడికి అనుమతి ఉంది. ఇందుకు సంబంధించి నిపుణులైన వైద్యులు, మా డ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లు ఉన్నాయి. కానీ అవయవదానానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు సాగకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంలో అధికారులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అనుమతి ఉన్న ఈ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అవయవ మార్పిడి కేంద్రంగా చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం.

జీజీహెచ్‌లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement