మహానంది: మహానందీశ్వరుడిని శనివారం రాత్రి ఏపీ వక్ఫ్‌బోర్డు ట్రిబ్యునల్ చైర్మన్ టి. రామచంద్రుడు, ఏపీ స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ హరిప్రకాశ్ దర్శించుకున్నారు. క్షేత్రానికి వచ్చిన వారికి ఆలయ సూపరింటెండెంట్ ఎం.నీలకంఠేశ్వరరాజు స్వాగతం పలికారు. ఈ మేరకు వారు శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. ద ర్శనం అనంతరం స్థానిక కళ్యాణ మండపంలో స్వామివారి ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు.
ఆలూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు శేషు (18) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు ఓంకార్‌కు త్రీవగాయాలయ్యాయి. ఆలూరు సమీపంలోని హైవే–167లో ఉన్న 133 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆలూరు మండలం అగ్రహారం గ్రామానికి చెందిన శేషు, ఓంకార్ స్కూటర్‌పై ఆలూరు నుంచి స్వగ్రామానికి వెళ్తూ ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టారు. ప్రమాదంలో శేషు (18) అక్కడిక్కడే మృతిచెందాడు. ఓంకార్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు శేషు(18) అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. తీవ్రగాయాలైన ఓంకార్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆలూరు ఎస్‌ఐ మన్మథ విజయ్ తెలిపారు.
ట్రాన్స్‌జెండర్లకు మూడు రోజుల మెగా క్యాంప్
కర్నూలు (అర్బన్): జిల్లాలోని ట్రాన్స్ జెండర్లకు వివిధ సంక్షేమ పథకాల అమలు, వారి సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11, 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు మెగా క్యాంప్ నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయీస్ ఫాతిమా తెలిపారు. ఈ క్యాంప్ ప్రతిరోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. ఆధార్, రేషన్, ఓటరు కార్డులు, విద్యార్హత సర్టిఫికెట్లలో పేరు, లింగం మార్పులు, సెర్ప్, మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘాల ఏర్పాటు, ఉచిత నైపుణ్య శిక్షణ, వ్యాపార రుణాలు, స్వయం ఉపాధి పథకాల నమోదు, ఉచిత సాధారణ ఆరోగ్య పరీక్షలు, మెడికల్ క్యాంప్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ద్వారా హెల్త్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణం కోసం దరఖాస్తుల స్వీకరణ తదితర సేవలు, ప్రయోజనాలు ఈ క్యాంప్‌లో పొందవచ్చన్నారు.
అలరించిన నృత్య ప్రదర్శన
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా శనివారం ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళావేదికపై హైదరాబాద్‌కు చెందిన రాగసుధ డ్యాన్స్ అకాడమీ వారిచే నిర్వహించిన సంప్రదాయ నృత్యప్రదర్శన భక్తులను అలరించింది. గణపతికౌత్వం, శివస్తుతి, నటేశకౌత్వం, లింగాష్టకం, భో శంభో శివతాండవం గీతాలకు నృత్యం ప్రదర్శించారు.


