కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ సీఈఓగా ఆర్.సుధాకర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ రెగ్యులర్ సీఈఓగా విధు లు నిర్వహించిన జీవీ రమణారెడ్డి గత జూన్ 30న పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి సీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 11న సెర్ఫ్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్.సుధాకర్ రెడ్డిని జెడ్పీ సీఈఓగా నియమిస్తూ పీఆర్ అండ్ ఆర్డీ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కాంతిలాల్ దండె ఉత్త ర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే సోమ వారం ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరిని, జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డిని గౌరవపూర్వకంగా కలసి బాధ్యతలు స్వీకరించారు.
సంక్షేమంలో కారుణ్య నియామకం
కర్నూలు(అర్బన్): సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని వసతిగృహాల్లో కారుణ్య నియామకం కింద ఒక మహిళకు ఉద్యోగాన్ని కల్పిస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని జొన్నగిరి సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న మాదిగ నాగరాజు ఈ ఏడాది ఫిబ్రవరి 21న ప్రమాదవశాత్తూ మృతిచెందారు. ఈ నేపథ్యంలో కారుణ్య నియామకం కింద మృతుడు నాగరాజు సతీమణి ఎం.సువేదకు పత్తికొండ బాలికల వసతి గృహంలో వంట మనిషిగా ఉద్యోగాన్ని కల్పించారు. ఈ మేరకు సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారిణి బి.రాధిక నియామకపు ఉత్తర్వులను సువేదకు అందించారు. కార్యక్రమంలో కార్యాలయ సీనియర్ సహాయకులు గద్ద రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
డీఎల్‌డీ ప్రవేశాలకు
నేటి నుంచి వెబ్ ఆప్షన్స్
కర్నూలు సిటీ: ప్రభుత్వ, ప్రైవేట్ డీఎల్‌డీ కాలేజీల్లో ప్రవేశాలకు నేటి(మంగళవారం)నుంచి 18వ తేదీలోపు వెబ్ ఆధారిత అప్షన్స్ ఇవ్వాలని ప్రభుత్వ డీఎల్‌డీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆయూబ్ హుసేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్–ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు సీట్ల కేటాయింపు చేస్తారని తెలిపారు. వీరంతా 24 నుంచి 29వ తేదీ వరకు ప్రభుత్వ డైట్ కాలేజీలో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించాలని పేర్కొన్నారు.
చెక్‌బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా కోర్టుల ప్రాంగణాల్లో ఈనెల 18న చెక్‌బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ప్రజలకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో 2026 జులై 18న కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని అన్ని న్యాయస్థానాల్లో పెండింగ్ చెక్‌బౌన్స్ కేసులు మాత్రమే పరిష్కరించుకోవడానికి ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు, బ్యాంకు, ఫైనాన్స్ అధికారులు, న్యాయవాదులు ఉపయోగించుకుని తమ చెక్‌బౌన్స్ కేసులను రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు.
25 మంది ఎకై ్సజ్ కానిస్టేబుళ్లకు హెచ్‌సీలుగా పదోన్నతి
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 25 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆ శాఖ జిల్లా నోడల్ అధికారి ఎం.సుధీర్ బాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారికి ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతాల నుంచి మరో ప్రాంతానికి స్థానచలనం కల్పించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. స్టేషన్లతో పాటు ఐఎంఎల్ డిపో, టాస్క్‌ఫోర్స్, డీసీఆర్, చెక్‌పోస్టులు తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి పదోన్నతి కల్పించి ఆయా స్థానాల నుంచి బదిలీ చేశారు. బదిలీల్లో భాగంగా కేటాయించిన స్థానాల్లో వెంటనే చేరిపోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


