ఆదోని ‘కూటమి’లో భగ్గుమన్న విభేదాలు | - | Sakshi
Sakshi News home page

ఆదోని ‘కూటమి’లో భగ్గుమన్న విభేదాలు

Jul 14 2026 4:29 AM | Updated on Jul 14 2026 4:29 AM

ఆదోని: కూటమిలో నెలకొన్న అంతర్గత విభేదాలను ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు పాలకవర్గ సమావేశం బహిర్గతం చేసింది. శనివారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పార్థసారధి జోక్యంతో మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ శారద జారీ చేసిన వ్యాపార లైసెన్సులను రద్దు చేయించారు. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చైర్‌పర్సన్‌ జిందే శారద మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం తాను జారీ చేసిన లైసెన్సులను సమావేశంలోనే రద్దు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారని ఆరోపించారు. సమావేశంలో కొందరు బీజేపీ డైరెక్టర్లను ఉద్దేశించి ‘‘ఈ లైసెన్సుల విషయం మీకు తెలుసా?’’ అని ఎమ్మెల్యే ప్రశ్నించగా, వారికి తెలియదని చెప్పారు. వెంటనే లైసెన్సులు రద్దు చేయాలని ఎమ్మెల్యే చెప్పడం పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను అవమానించడమేనని ఆమె చెప్పారు. సమావేశంలో చైర్‌పర్సన్‌తో పాటు డైరెక్టర్లు మాట్లాడబోతుంటే ‘మీకేమీ తెలియదు.. గమ్మున కూర్చోండి’ అంటూ అందరి నోళ్లను ఎమ్మెల్యే మూయించడం ఆయనకు తగదన్నారు. రాజకీయ వర్గాల విశ్లేషణ ప్రకారం ఈ పరిణామం టీడీపీ, బీజేపీ మధ్య ఆధిపత్య పోరుకు సంకేతంగా కనిపిస్తోంది. మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ అధికారాలను బహిరంగంగా ప్రశ్నించడం, ఆమె నిర్ణయాన్ని సమావేశంలోనే వెనక్కి తీసుకునేలా చేయడం కూటమిలో సమన్వయ లోపాన్ని బహిర్గతం చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చైర్‌పర్సన్‌ స్వయంగా విలేకరుల ముందుకు వచ్చి ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం కూటమి అంతర్గత విభేదాలను బహిర్గతం చేసింది. అయితే చైర్‌పర్సన్‌ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే పార్థసారధి నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

బీజేపీ, టీడీపీ మధ్య చిచ్చు

ఆదోని మార్కెట్‌ యార్డ్‌ పాలకమండలి

నిర్ణయాలను రద్దు చేయించిన ఎమ్మెల్యే

చైర్‌పర్సన్‌ జిందే శారద

సంచలన ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement