‘మార్కెట్‌’ పాలక వర్గాల పదవీ కాలం పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

‘మార్కెట్‌’ పాలక వర్గాల పదవీ కాలం పొడిగింపు

Jul 14 2026 4:29 AM | Updated on Jul 14 2026 4:29 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి జిల్లాలోని రెండు వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పాలక వర్గాల పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, నంద్యాల జిల్లా పాణ్యం వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పదవీ కాలాన్ని మొదటి దఫా ఆరు నెలలు పొడిగిస్తూ వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

శతాధిక వృద్ధురాలి మృతి

ఎమ్మిగనూరుసెంట్రల్‌: ఎమ్మిగనూరు మండలం మల్కాపురం గ్రామంలో శతాధిక వృద్ధురాలు కురువ హనుమంతమ్మ(106) సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. నెల క్రితం వరకు తన పనులు తాను చేసుకుంటూ ఆరోగ్యంగా ఉన్న ఈమెకు ఇటీవల వృద్ధాప్య సమస్యలు వెంటాడాయి. బీపీ, షుగర్‌ వంటి లక్షణాలు లేవని, అందరినీ ఎంతో ఆప్యాయంగా పలికించరేవారని గ్రామస్తులు తెలిపారు. వైద్యులు డాక్టర్‌ మల్లికార్జున, డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి, ఇతర రాజకీయ ప్రముఖులు హనుమంతమ్మ మృతదేహానాకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్లేగు సంభవించడం, తుంగభద్ర దిగువ కాలువ పనుల ప్రారంభం వంటివి హనుమంతమ్మకు గుర్తు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు.

అప్పుల బాధతో అస్వస్థతకు గురై..

బండిఆత్మకూరు: అప్పుల భారం ఓ రైతు ప్రాణం తీసింది. పరమటూరు గ్రామానికి చెందిన పిక్కిలి శివరాజు (43) గతేడాది తనకున్న ఏడెకరాల పొలంతో పాటు, మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప, పొగాకు పంటలు సాగు చేశాడు. ఆశించిన మేర పంట దిగుబడి రాకపోవడం, వచ్చిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో అప్పుల భారంతో మనోవేదనకు గురై పది రోజుల క్రితం అనారోగ్యం పాలు కావడంతో ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి అస్వస్థతకు గురై గుండె పోటు రావడంతో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబీకులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మృతి చెందాడు. శివరాజు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్య పద్మావతి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రైతు కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

సార్‌.. వ్యవసాయమే ఆధారం

ఉయ్యాలవాడలో ఎస్పీ పర్యటన

గ్రామస్తులతో కాసేపు మాటామంతి

ఉయ్యాలవాడ: ‘సార్‌ మా మండలంలో ఎలాంటి పరిశ్రమలు లేవు. ప్రతి ఒక్కరూ వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాం. ఈ ఏడాది ఇంత వరకు పంటలు సాగు చేసేందుకు వానలు కురవలేదు’ అంటూ ఉయ్యాలవాడ ప్రజలు జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌తో అన్నారు. సోమవారం ఉయ్యాలవాడను ఎస్పీ సందర్శించారు. గ్రామస్తులతో కాసేపు సరదాగా మాట్లాడుతూ వారి జీవన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. స్థానిక వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం సమీపంలో వున్న రచ్చబండపై కాలాక్షేపానికి గ్రామస్తులు ఆడుతున్న పులిగీతం ఆటను చూసి.. ఆటను ఎలా ఆడాలంటూ వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళియుగ దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి వంశీయులు బుడ్డా విశ్వనాథరెడ్డి స్వగృహానికి వెళ్లారు. వెంగళరెడ్డి జీవిత విశేషాలను తెలుసుకున్నారు. ఆయనకు విక్టోరియా మహారాణి అందజేసిన బంగారు పతకాన్ని సందర్శించి, ఆ పతకం ఇవ్వడానికి కారణాలను తెలుసుకున్నారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్‌ పై కప్పు నుంచి ఇనుప చువ్వలు బయట పడివుడడంపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. గ్రామస్తులు కక్షలకు దూరంగా ఉండి ప్రశాంతంగా జీవించాలని ఎస్పీ సూచించారు. ఆయన వెంట ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసులు, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ ఎస్‌ఐలు మల్లికార్జునరెడ్డి, రామిరెడ్డి, ఏఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement