● జిల్లా వ్యాప్తంగా దస్తావేజులేఖర్ల పెన్‌డౌన్
కర్నూలు(సెంట్రల్): దస్తావేజు లేఖరులు పెన్‌డౌన్ చేయడంతో సోమవారం జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలు స్తంభించిపోయాయి. ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర గండి పడింది. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, ఆస్పరి, కోసిగి, కర్నూలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట దస్తావేజు లేఖరులు నిరసన తెలిపారు. కర్నూలులో ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ఎస్‌ఏ రెహమాన్ మాట్లాడారు. రిజిస్ట్రేషన్‌సేవా కేంద్రాల ఏర్పాటుతో డాక్యుమెంట్‌రైటర్ల జీవనోపాధికి గండి పడుతుందన్నారు. జీఓ నంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అంత వరకు పోరాటాన్ని విరమించబోమని హెచ్చరించారు. అనంతరం కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్లకు వినతిపత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సీఎస్ మహహ్మద్ రఫీ, వైస్ ప్రెసిడెంట్ మస్తాన్ సాహెబ్, నాయకులు నాగేశ్వరరావు, హనుంతరావు, చంద్రశేఖర్, ఇస్మాయిల్, రామకృష్ణ, రామచంద్రారెడ్డి, బాషా, భాస్కర్, హుద్దూస్, మహేష్ పాల్గొన్నారు.


