
దివ్యాంగుల ఆగ్రహం
● ఎంపీడీఓ కార్యాలయం
గేటు మూసి నిరసన
కోసిగి: వికలాంగత్వం తక్కువ చూపి పింఛన్ తొలగించేందుకు కుట్ర పన్నుతున్న కూటమి ప్రభుత్వంపై దివ్యాంగులు కన్నెర్రజేశారు. ఇదెక్కడి న్యాయమంటూ నిరసనగళం వినిపిస్తున్నారు. కోసిగి మండలంలో నోటీసులు అందుకున్న పలువురు తమ గోడు వినిపించేందుకు బుధవారం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, అక్కడ అటెండర్ తప్ప అధికారులెవ్వరూ లేకపోవడంతో కార్యాలయం గేటు మూసి వేసి ఆందోళనకు దిగారు. దాదాపు రెండు గంటల పాటు కార్యాలయం ఎదుట కూర్చొని ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో వచ్చిన ఎంపీడీఓ ఈశ్వరయ్య దివ్యాంగులతో మాట్లాడకుండా కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. మా ఆవేదన పట్టదా అంటూ నిలదీశారు. ఎన్నో ఏళ్ల నుంచి తమకు పింఛన్ వస్తుందని, ఇప్పుడెందుకు నోటీసులు పంపించారని ప్రశ్నించారు. ఈక్రమంలో ఎంపీడీఓ, దివ్యాంగుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, అలాగే మరోసారి రీవెరిఫికేషన్ చేయిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.