
దివ్యాంగుల పింఛన్ల తొలగింపు దారుణం
ఆలూరు: అడ్డగోలు నిబంధనలతో కూటమి సర్కారు దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దారుణమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మండిపడ్డారు. సర్కారుకు తప్పనిసరిగా దివ్యాంగుల ఉసురు తగులుతుందన్నారు. ఆలూరులో ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో కులమతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజూరైందన్నారు. వీరందరికి తాము అధికారంలోకి వస్తే అధిక పింఛన్ ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. నమ్మి ఓట్లేసిన దివ్యాంగులకు ఇప్పుడు నోటీసులు జారీ చేసి పింఛన్ ఎత్తివేస్తున్నారన్నారు. కొత్త పింఛన్లు దేవుడెరుగు ఉన్న పింఛన్లకు కూడా కోత పెడుతుండటంతో పేదలకు దిక్కుతోచడం లేదన్నారు. సమావేశంలో ఆలూరు ఎంపీపీ రంగమ్మ, ఎంపీటీసీలు బోయ ఎల్లమ్మ, జీరా నాగమ్మ, దేవరాజ్, జిల్లా వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ కార్యదర్శి భాస్కర్, మండల కో ఆప్షన్ మెంబర్ బాషా, అరికెర వెంకటేశ్వర్లు, మండల కో–కన్వీనర్ వీ రేష్, నాయకులు నాగప్ప, బాబ, జాన్ పాల్గొన్నారు.
అటవీ ఉద్యోగులపై టీడీపీ ఎమ్మెల్యే దాడి హేయం
కర్నూలు కల్చరల్: విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖ ఉద్యోగులపై శ్రీశైలం శాసన సభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అతని అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ నాయకులు అన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మంగళవారం రాత్రి శ్రీశైలం శిఖరం చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఉప అటవీ క్షేత్రాధికారి, ఇద్దరు బీట్ ఆఫీసర్లను, ఇతర సిబ్బందిని కిడ్నాప్ చేసి వాహనంలో బంధించి ఎమ్మెల్యే దౌర్జన్యానికి పాల్పడుతూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ, భౌతిక దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగుల వాకీటాకీలు, సెల్‌ఫోన్‌లు ఇతర వస్తువులను తీసుకొని వాహనంలో శ్రీశైలం, సున్నిపెంట రోడ్లన్నీ తిప్పుకుంటూ దాడిచేశారని పేర్కొన్నారు. గెస్ట్‌హౌస్‌లో బంధించి ఇబ్బంది పెట్టి రాత్రి రెండు గంటలకు వదలి పెట్టారని తెలిపారు. సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న అటవీ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు జి.కిరణ్‌కుమార్, ఉపాధ్యక్షులు ఎస్.అబ్దుల్ కలాం, రాయలసీమ జోనల్ సెక్రటరీ డి.మౌలాలి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం. రతీదేవి, జాయింట్ సెక్రటరీ ఆర్. కాసిదాసు, కోశాధికారి సి. అనురాధ పేర్కొన్నారు. ఉపముఖ్య మంత్రి, అటవీ శాఖ మంత్రి స్పందించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.