
పదోన్నతులకు గ్రహణం
కర్నూలు(సెంట్రల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 150 మంది గ్రేడు–2 వీఆర్వోల పదోన్నతి ప్రక్రియ ఏడాదిగా నిలిచిపోయింది. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పడిన తొలినాళ్లలో రెండు జిల్లాల పరిధిలో 469 మంది గ్రేడు–2 వీఆర్వోలను నియమించారు. వీరికి 2023 ఆఖరిలోనే గ్రేడు–1 వీఆర్వోలుగా పదోన్నతి కల్పించాలని అప్పటి ప్రభుత్వం యోచించింది. అయితే ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 2023 ఏప్రిల్ 3వ తేదీన పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని 2024 ఆక్టోబర్ 10వ తేదీన జిల్లా కలెక్టర్ ఆదేశాలు వచ్చాయి.
మే 9న తుది జాబితా
పదోన్నతుల కోసం సీనియారిటీ జాబితాను తయారు చేసేందుకు రెండు నెలలు, తుది జాబితా తయారీకి మరో నెల సమయం పట్టింది. మొత్తంగా 2025 జనవరి ఏడో తేదీ నాటికి పదోన్నతులకు అర్హత ఉన్న జాబితాను తయారు చేశారు. ఆ జాబితా ప్రకారం 150 ఖాళీలకు రోస్టర్ రూపొందించడానికి మార్చి 25వ తేదీ వరకు సమయం పట్టగా...దానిపై అభ్యంతరాలను స్వీకరించడానికి ఏప్రిల్ 3వ తేదీ వరకు గడువు విధించారు. అయితే తరువాత ఏప్రిల్ 19వ తేదీ వరకు ఆలస్యం చేయడంతో ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు రావడంతో దాని ప్రకారం రోస్టర్ తయారు చేయడానికి ఏప్రిల్ 30వ తేదీ వరకు సమయం తీసుకుని మే 9వ తే దీన పూర్తి స్థాయి తుది జాబితాను రూపొందించారు.
అధికారుల అలసత్వం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికారుల అలసత్వంతోనే గ్రేడు–2 వీఆర్వోల పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయిందని ఆశావాహక ఉద్యోగులు పేర్కొంటున్నారు. కలెక్టర్ ఆగస్టులో ఆదేశాలు ఇచ్చినా రోస్టర్‌తో కూడిన అర్హుల జాబితాను తయారు చేయడానికి 8 నెలలు తీసుకోవడం..అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ రావడంతో ప్రక్రియకు తీవ్ర ఆటంకం కలిగినట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ ఏప్రిల్ 19వ తేదన విడుదలైంది. అయితే ఏప్రిల్ మొదటి వారంలోనే కృష్ణ, శ్రీకాకుళం జిల్లాల్లో గ్రేడు–2 వీఆర్వోల పదోన్నతులను పూర్తి చేశారు. అయితే జిల్లా అధికారులు మాత్రం తమ నిర్లక్ష్యంతో తుది అర్హత జాబితాను రూపొందించకపోవడమే ఈపరిస్థితికి కారణంగా తెలుస్తోంది.
ఏడాదిగా ముందుకు సాగని ప్రక్రియ
ఎదురు చూస్తున్న 150 మంది
గ్రేడు–2 వీఆర్వోలు
కొందరు డబ్బులు వసూలు చేసిన వైనం!
పదోన్నతుల పేరిట వసూళ్లు
2024 ఆగస్టు నుంచి గ్రేడు–2 వీఆర్వోల పదోన్నతుల ప్రక్రియ మొదలు కావడంతో అప్పట్లో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు ఆశావాహుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. జాబితాలో పేరు ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని కలెక్టరేట్‌లో పని చేసే కొందరు ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో కొందరు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశారు. అయితే డబ్బులు ఇచ్చినా పదోన్నతి రాకపోవడం..ఇటు డబ్బులు వసూలు చేసిన అధికారులు బదిలీపై వెళ్లడంతో వారికి దిక్కుతోచడంలేదు. తాము ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని అడుగుతున్నా వసూలు చేసిన అధికారులు ఇవ్వడంలేదనే వాదన ఉంది.